Monday, April 18, 2005

జాషువా ఆత్మకథాత్మక కావ్యం: గబ్బిలం (రెండు)

- డా, కఠెవరపు వెంకట్రామయ్య

కాలం కంటే రెండడుగులు ముందే!

ఆంధ్ర సాహిత్య వికాసాన్ని ఒకసారి పునఃపరిశీలిస్తే - ఆడది లేకపోతే కృతికి అందం లేదనే భావంతో ధనతృష్ణ వెంటాడగా బృహన్నల వర్గం సంతోషం కోసం ప్రబంధ కవులు అనుత్తమ ప్రణయబంbధుర కావ్యాలు రచించటం కన్పిస్తుంది। కవిత చచ్చుదైనా కథ ప్రసిద్ధమైనదైతే కవికి కొంతకీర్తి గలుగవచ్చు। అలాంటి కవిత్వం నెలలు తక్కువైనా బలమైన తిండితో బ్రతికే పాపలాంటిది। "ప్రభువుల పెండ్లి పేరంటాలకు కొంతకాలం ఖర్చయింది। ఆ తరువాత రాణివాసాల్లోని విరహ వేదనల్ని రచ్చకీడ్చింది। అనంతరం అంగాంగ వర్ణనలతో యువతకు ఉచ్చులు వేసింది। 'పాడిన రామకథే మరలపాడి' ఆర్తులను అనాదరిస్తూ-భువన హితాన్ని కోరవలసిన కళాశక్తి స్వార్థ జడదిన ఊరవేయబడింది' అంటాడు జాషువా। ఇదీ మన సంచిత ధన సంపద। ఇక ఆధునిక యుగం।

జాషువా భావకవితా యుగంలో కలం బట్టిన కవ। "దిగిరాను దిగిరాను భువినుండి దివికి" "నా ఇచ్ఛయేగాక నాకేటి విరవు" అని కంత నగరాల (ivory towers) ల్లో విహరిస్తూ ఊహాప్రేయసి మీద గేయాలల్లూతూ, ఆ విరహంలో తలమున్కలై "మనసారగా ఏడ్వనీరు నన్ను" అంటూ భావుకవులంతా ఎవరికి వారు యధాశక్తి రోదిస్తున్న కాలమది। అయితే జాషువా భువిని వీడలేదు। దివిలో కాపురం పెట్టనూ లేదు।

పూదోటల మద భంభర

నాదముల విలాసవతుల నడబెడగుల నా

హ్లాదించు కవులకీ నిరు

పేదల ఆక్రందనములు వీనుల బడునా! (ముసాఫరులు)


అని సమకాలీన భావ కవులను నిరసించాడు। అందుకే భావ కవుల కంటే అభ్యుదయ కవులే ఈయనకు ప్రీతి పాత్రులయ్యారు। వర్గ సంఘర్షణ, ఆర్థిక వ్యత్యాసాల నిర్మూలనం, దోపిడీ వర్గాలపై తిరుగుబాటు, సమ సమాజ నిర్మాణ, సమర విముఖత, శాంతిప్రియత వంటి అభ్యుదయ కవితా లక్షణాలు జాషువా కవితల్లో చోటుచేసుకున్నాయి।

మా కవు లాలపింతురు సమంచిత నవ్యయుగో చితంబులై

యాకటి చిచ్చు లార్చు హృదయ ప్రీతి దారి దయాకధాంశముల్

(కాందిశీకుడు)

ఈ అభ్యుదయ దృక్పథమే జాశువాచేత "గబ్బిలం" రాయించింది। దళిత వేదనకు అక్షరాకృతి నిప్పించించి। అసలు "గబ్బిలం" ఇతివృత్తమే అభ్యుదయాంశతో ముడిపడినటువంటిది। భరతమాతకు కడగొట్టు బిడ్డడైన ఒక అరుంధతీ సుతుడు-సమాజంలో పాతుకుపోయిన అంటరాని తనాన్ని, వర్ణ వ్యవస్థలోని క్రూరత్వాన్ని-తన సందేశంగా శివునికి గబ్బిలం ద్వారా విన్నవించుకోవటం ఈ కావ్యేతివృత్తం। రెండు భాగాలుగా సాగిన ఈ కావ్యం తొలి భాగంలో అరుంధతీ సుతుడు తన దైన్యాన్ని విన్నవించుకుంటాడు। సామాజికంగా అనుభవిస్తున్న నిరసనను వ్యక్తం చేస్తాడు। ఆపై గబ్బిలానికి మార్గనిర్దేషం చేస్తాడు। గబ్బిలం విశ్వానాధుని దగ్గరకు పయనమై వెళుతుంది। ఇది ప్రథమ భాగం। తర్వాత కొన్నాళ్ళకు గబ్బిలం మరలా కనిపిస్తుంది। వెళ్లిన పని "పండే"నని చెప్తుంది। మరలా పంచముడు తన గోడు వినిపించుకొంటాడు। భారత జాతి అనైక్యత, కుల, మతభేదాలు, స్వీయకులంలోని వైరుధ్యాలు, మూఢాచారాలు, దేశాభిమానం రెండవ భాగంలోని అంశాలు। వస్తుభావాల విషయంలో సమకాలీన కవుల కంటే ఒకడుగు ముందుకువేసి, దళీత కవిత్వానికి తెలుగులో బీజం వేశాడూ। ఈనాటీ 'దళిత కవితావాదకవు'లనీకులు కంటే జాషువా నిర్భయంగా, బలంగా, సూటిగా కవితను చెప్పాడు। కాబట్టే తెలుగు దళిత కవిత్వానికి "ఆది కవి" జాషువా। ఆయన "గబ్బిలం" కళిత కవితా మేనిఫెస్టో।


'గబ్బిలం' కావ్యం పై రేడియో ప్రసంగం ఇక్కడ వినవచ్చు

2 comments:

kiran kumar Chava said...

మరొక తెలుగు కవిత చూడటం ఆనమ్దంగా ఉన్నది।
చూడండి
తెలుగు బ్లాగులు

RAMESH GORLE said...

Chala bagundhi mee krushi..thank you