Monday, April 18, 2005

జాషువా ఆత్మకథాత్మక కావ్యం: గబ్బిలం (ఆరు)

- డా, కఠెవరపు వెంకట్రామయ్య

వైరుధ్యంలో వైశిష్ట్యం:

అభ్యుదయ కవితా తత్వాన్ని జీర్ణించుకొన్న జాషువా సమకాలీన అభ్యుదయ కవుల్లా గేయ చందస్సునూ, వచన కవితా రీతినీ చేపట్టలేదు। శిష్ట వ్యవహారికాన్ని స్వీకరించనూ లేదు। సరళ గ్రాంధికాన్ని, ప్రాచీన పద్య చందస్సునూ సమాశ్రయించాడు। అయినా కండగల పద్యరచన జాషువాది। సమకాలీన పద్యకవుల్లో జాషువు పద్యం పొందినంత నిస్తుల ప్రచారం మరేకవి పద్యం పొందలేదనటం అతిశయోక్తి కాదు! సహజోక్తే! పద్య శిల్పం జాశువాదే। అభ్యుదయ కవుల్లో శ్రీశ్రీ గేయానికి ఎంత ప్రచారం, ప్రాశస్త్యం తెచ్చాడో॥ జాషువా పద్యానికి అంతటి జవజీవాల్ని తెచ్చిపెట్టాడు। కవిత్వానికి రూపం(form) కంటే వస్తువే ముఖ్యమని నిరూపించిన కవి జాషువా। వస్తువు(content) మారినపుడు రూపం కూడా మారటం సర్వసాధారణమైన సాహిత్య సూత్రం। అయిన ఆ సార్వత్రిక సూత్రాన్ని అధిగమించి కాలం పరీక్షల్లో నిలిచి గెలుపొందింది జాషువా పద్యం। పద్యం తెలుగువాడి సొంత సొత్తు। దాన్ని పసిగట్టి ప్రజల గుండెల్ని దోచుకున్నాడు। కాలానికి ఎదురొడ్డి నిలిచాడు। తన కవితను బ్రతికించుకున్నాడు। ఆయన పద్యంలోనే వ్రాశాడనీ, గ్రాంధిక భాష వాడాడనీ ఈ సహృదయ పాఠకుడు ఆయనకు దూరం కాలేదనటం వాస్తవం। చెప్పే విషయం చేవగలదై, చెప్పే విధానం జీవద్వంతమైతే పాఠకుడు ఎందుకు ఆదరించుడు? అవి రెండూ చేతగాని కవుల కావ్యాలు పేజీల లెక్కన కాదు। కేజీల లెక్కన మిగులుతాయి।

జాషువా - భవిష్యత్సమాజ దర్శనం:

"జీవితం నాకు ఎన్నో పాఠాలను నేర్పింది। నా గురువులు ఇద్దరు - పేదరికం, కులమత భేదం। ఒకటి నాకు సహనాన్ని నేర్పితే, రెండవది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే గాని బానిసగా మాత్రం మార్చలేదు। దారిద్ర్యాన్ని, కులభేదాన్ని కుడా చీల్చి నేను మనిషిగా నిరూపించుకోదలిచాను। వాటిపై కత్తి కట్టాను। అయితే కత్తి నా కవిత। నా కవితకు సంఘంపై ద్వేషం లేదు। దాని విధానంపైనే నా ద్వేషం" (మా నాన్న।పు।10) - అన్నాడు జాషువా। అంటారానితనంలోని అవమానాన్ని, దారిద్ర్యంలోని బాధను తాను స్వయంగా అనుభవించాడు। తన తోటి సోదరులు, బంధువులు జీర్ణ కుటీరాలలో వుంటూ రోజుకూలిపై అర్థాకలితో మాడుతూ బ్రతక లేక బ్రతికే వారి బాధలను, జీవిత గాధలను ప్రత్యక్షంగా చూశాడు। దానికి రూపకల్పనే 'గబ్బిలం'। తెలివికి కలిమిలేములతో నిమిత్తం లేదనీ, ప్రతిభను కులమతాల తక్కెడలో తూచరాదనీ విశ్వసించి, కులమతాల కతీతమైన మానవతా తొణికిసలాడే మరో ప్రపంచం కోసం అర్రులు చాచిన జాషువా, 'గబ్బిలం' కావ్యంలో తాను ఎలాంటి సమాజాన్ని కోరుకుంటున్నాడో సూచించాడు। ప్రజలను బాధపెట్టే బహుదేవతలు లేని చోటు, నవనీత సమానమైన కవుల కమ్మని వాక్కు భయము లేకుండా వెల్లివిరిసే నేల ప్రభుత్వ పరంగా - పాలకవర్గాలు - సృజనాత్మక రచనల మీద 'ఆంక్షలు-నిషేధాలు' విధించని చోటు - ఎంతముందు చూపు జాషువాది? సంతానానికి భేదభావాలు నేర్పని తల్లిదండ్రులున్న స్థలం, తోడునీడలేని దుర్బలుల కాచే ప్రదేశం - ఇలాంటి దేశాన్ని, సమాజాన్ని కోరుకున్నాడు జాషువా।

భోగులాహరించు భుక్తి కన్నుల జూచి

పరమ పేదలు దుఃఖపడనిచోటు,

సాంఘికాచార పంచాస్య గర్జనమున

బెదరక జ్ఞానంబు పెరుగుచోటు,

జాతి వైషమ్య రాక్షస పదాహతి చేసి

కందక కళలు పెంపొందుచోటు,

పరిపాలక క్రూరతర కరాసికి లొంగి

పోక స్వేచ్ఛాలక్ష్మి పొదలు చోటు,

అనద బిడ్డలు జూడ నెయ్యింపు సుతుల

ముద్దులాడని గుణనిధుల్ బుట్టుచోటు

చెప్పగదమ్మ చూచివచ్చితివె నీవు

నిశ్చయింబుగ వాసముండెదను నేను


జాషువా ఆశించిన 'కొత్తలోక'మిది। ఇటువంటి భావాలతో 'గబ్బిలం' నిజమైన సామాజిక వాస్తవికతావాద (social realistic) కావ్యం। కర్మ సిద్ధాంతం నుంచి కవిత్వం దాకా॥ వినుకొండ నుంచి వెండికొండ దాకా॥ నన్నయ నుండి వేమన దాకా ఇలా ఆయన హృదయాన్ని స్పృశించి, స్పందింపజేసిన ప్రతి అంశాన్ని రసవత్తరంగా మలచిన సామాజిక సందేశాన్ని అందించిన కవి జాషువా। సమాజ సముద్ర మధనం చేసి జాషువా సాధించిన అమృత కలశం 'గబ్బిలం'। దళిత వేదనకు అక్షర రూపం 'గబ్బిలం'

కోటానుకోట్ల నరులొక

మేటి జగన్మాతృసుతులు మిత్రులని మదిం

చాటింపు మీ సువార్తన్

జాటింపుము జీవితంబు సార్థక్యమగున్
(ముసాఫరులు)

'గబ్బిలం' కావ్యం పై రేడియో ప్రసంగం ఇక్కడ వినవచ్చు

------------------------------------------------------- సమాప్తం

No comments: