Monday, April 18, 2005

జాషువా ఆత్మకథాత్మక కావ్యం: గబ్బిలం (ఒకటి)

- డా, కఠెవరపు వెంకట్రామయ్య


"తనకీ, ప్రపంచానికీ, సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్, బహిర్ యుద్ధారావమే కవిత్వం"
- చలం (శ్రీశ్రీ - మహాప్రస్థానం - 'యోగ్యతా పత్రం' లో)


వినుకొండ పొలిమేరలను దాటి, వినువీధి అంచులను తాకటానికి ఉద్యమించిన విశ్వనరుడుగా, వీను మిగిలిన కవివరుడుగా తెలుగు సాహితీ ప్రపంచంలో పేరు ప్రతిష్టలను పొందిన కవి జాషువా (1895-1971)। సామాజిక చైతన్యంతో విశ్వజనీనతను జోడించి, కారుణ్యం, మానవీయ విలువలను ఆవేదనను ఆవిష్కరించిన జాషువా పద్యకృతి 'గబ్బిలం'।


జీవిత కృతి - 'గబ్బిలం'

కవి శక్రేశుడు గండపెండెరములన్ గాంగేయ తీర్థంబులన్

వివిధోపాయన సత్కృతుల్ గొనిన గాంధీ శాంతి సిద్ధాంత మా

ర్థవ మార్గటుడు గబ్బిలంబులకు దౌత్యంబుల్ ప్రబోధించు మా

నవతా స్రష్టన్ నవ్యభావ చతురుండన్ జాషువాభిఖ్యుడన్


జాషువా తన గురించి చెప్పుకున్న పద్యమిది। కవులు, రచయితలు తాము ఎన్ని రచనలు చేసినా, వాటిలో తమకు నచ్చిందీ, ప్రజలు మెచ్చిందీ, ఆ కవికి లేక రచయితకు కీర్తి ప్రతిష్టలు గడించి పెట్టిందీ అయిన రచన సాధారణంగా ఒకటో, రెండో ఉంటాయి। అలాంటి రచనల్నే 'జీవితం కృతులు' (Life Works) అని అంటాం। ఆ కవి భావనా సర్వస్వం, కవితా శిల్ప సౌందర్యం సమస్తం, గుత్తుకు కొన్న కావ్యం అదే అయి వుంటుంది। జాషువా ఇంచుమించు ముప్ఫై పై చిలుకు గ్రంథాలు రచించాడు। "సర్వ పండితామోదముగా రచియించితిని (వి) ముప్పది కావ్యములు"। (నా కథ-158)। అయినా ఆయన ఆమరణాంతం చెప్పుకున్న కావ్యం "గబ్బిలమే"। ప్రజలు మెచ్చి ప్రశంసించిందీ "గబ్బిలాన్నే"। అందువల్లే, 'గబ్బిలం' జాషువ జీవిత కృతి। అంతేకాదు, ఆయన రచనలల్లోనే అది 'శిరశ్శేఖర కృతి' (Monumental work) కూడా! జాషువా మిగిలన రచనలన్నీ ఒక ఎత్తు 'గబ్బిలం' ఒక్కటీ ఒక ఎత్తు। జాషువా జీవత ప్రస్థానానికీ, సామాజిక దర్శనానికీ నిదర్శనంగా నిలిచేది ఈ 'గబ్బిలం' కావ్యం।


గబ్బిలం: ఖండకావ్యం

గురజాడ తో 'కావ్య ఖండిక' ల రచన (1910) ఆరంభమైనా, ఖండకావ్య ప్రక్రియ మాత్రం రాయప్రోలు సుబ్బారావుగారి చేతిలోనే మొలకెత్తింది। అది జాషువా చేతిలో పుష్పించి ఫలించింది। ఖండకావ్య రచనలో అఖండ ప్రతిభా సంపన్నుడు జాషువా। ఆయన ఖండకావ్యాలు అటు రాశిలోను, ఇటు వాసిలోను మిన్న అయినవే। "ఫిరదౌసి", "గబ్బిలం", "కాందిశీకుడు", "ముంతాజమహలు", "నేతాజీ", "ముసాఫరులు" మొదలైన ఖండకావ్య రచనలతో పాఠకలోక ప్రాచుర్యాన్ని చూరగొన్న కవి జాషువా। వీటిల్లో "గబ్బిలం" రెండు భాగాలున్న ఖండకావ్యం। మొదటి భాగంలో సుమారు 117 పద్యాలు। రెండవ భాగంలో 142। మొత్తం 259 పద్యాలున్న గబ్బిలాన్ని లఘుప్రబంధం అనవచ్చు। మొదటి భాగం 1941 లోను, రెండవ భాగం 1946 లోను రచించబడ్డాయి।


"గబ్బిలం"- స్వీయచరిత్ర నివేదనాత్మకం

"Best poetry is always autobiographical"(ఉత్తమ కవిత ఎప్పుడూ స్వీయ చరిత్ర నివేదనాత్మకమే) అని అంటాడొక అంగ్ల విమర్శకుడు। దానికి అక్షర సాక్ష్యం గబ్బిలం।

కుల మత విద్వేషంబుల్

తలసూపని తావులే కళారాజ్యంబుల్

కళ లాయుష్మంతములై

యలరారెడు నెలవు స్వర్గమగు చెలికాడా!


(నా కథ 1-127)

కళాకారులందరిదీ ఒకే జాతి, ఒకే మతం, ఒకే కులం। ఆ విశాల దృక్పథం లోపిస్తే కళలు బతకవు। ఒక వేళ బతికినా బట్టకట్టవు। జాషువా చిన్నతనం నుంచి అటు వ్యక్తిగా, ఇటు కలావేత్తగా కుల వివక్షతకు నలిగిపోయాడు। 'నా కథ'లోన 'వ్యధా ఘట్టములు' ఆ గుండెకోతకు, ఆ ఆవేదనకు అక్షర రూపాలు। "లోకం నా వంక కోరగా, వారగా చూచింది। అనాదరించింది। అసత్కరించింది। సత్కరించింది। దూరపర్చించి। చేరదీసింది।"(నా కథ - ఒక మాట)। జాషువా జీవిత ప్రస్థానాన్ని ఈ మాటలు తెలియచేస్తాయి। అయన కవితా సృష్టికి ఇదే ప్రత్యక్ష్య నేపథ్యం।

ఒక రోజు బాల జాషువా వినుకొండ వీధిలో వెళుతుండగా అగ్రవర్ణానికి చెందిన మరో బాలుడూ ఆ వీధినే పోతూ "నాను తాకకు। దూరంగా పో!" అని ఈసడించుకున్నాడట। ఆ అవమానాన్ని భరించలేక తన ఆవేదనను తల్లిముందు తోడుకున్నాడు। తల్లి బాలుని కన్నీరు తుడిచింది। తన కళ్ళలో నీళ్ళుబుకుతున్నా తమాయించుకుంది। ఆ పిల్లవాడే మరికించెం ఎదిగి కవిత లల్లటం మొదలు పెట్టాడు। బాలకవిగా తాను 'వ్రాసిన వ్రాతలు గని సెహబాసను వాడొకడు లేక వ్యధ'కు గురి కావలసి వచ్చింది। దానికి తోడు, 'వాదన చేసి కాదనెడి పాటి సమర్థత'లేని చిన్ననాడు తన ఊళ్ళోని వైష్ణవ పూజారి 'ఇతర జాతులు కైతలల్ల రాద'ని 'పురాణ యుగధర్మ సూత్రాల'ను వల్లించి, జాషువా లేత మనసును గాయపరిచాడు। దీనిని మించి జాషువా హృదాయాన్ని కలచివేసిన సంఘటన మరొకటి ఆయన కవితా వ్యాసంగ ప్రారంభదినాలలోనే జరిగింది। తన ఆశుకవితా నైపుణ్యంతో కొప్పరపు సుబ్బారావుగారు వినుకొండలో జరిగిన ఒక సభలో ప్రజలను ఉర్రూత లూగించారు। జాషువా ఆయన్ని అభినందిస్తూ పద్యాలు అప్పటికప్పుడు ఏవో గిలికాడు। వాటిని ఆయనకు అందజేయటానికి భపడుతూ, స్భాస్థలి దగ్గర తారట్లాడే జాషువాని ఆయన భ్రాహ్మణమిత్రుడొకడు వేదిక దగ్గరకు తీసుకువెళ్ళాడు। సుబ్బారావుగారు పద్యాలు తేసుకొని చదివి, సహృదయంతో బాలకవిని అభినందించారు। సభలో 'గుభగుభలు' బయలుదేరాయి। 'అభాగ్యుడీ నిమ్నజుడు సభలోని కెట్టు జొరబడెన'ని పదిమందీ ఉద్దతులై లేచిపోయారు। అలనాడు భారత కాలంలో అస్త్రవిద్యా ప్రదర్శ్నలో కర్ణుడికి జరిగిన అవమానమే తిరిగి ఆనా జాషువాకి జరిగింది। ఆ రోజంత ఇక ఇల్లుదాటి బైటికి రాకుండా, భోజనం చేయకుండా, తనలో తానే ఏద్చుకుంటూ దుఃఖంలో తలమున్కలై పొద్దుపుచ్చాడట। ఇలాంటి సన్నివేశాలా నెన్నింటినో ఆయన కవిగా నిలదొక్కుకునే రోజులలో ఎదుర్కొన్నాడు। "కుల భేదశానికి నువ్ మెదలెడు దేశమిద్ది నిను మిచ్చదు, మెచ్చిన మెచ్చకున్న శారద నిను మెచ్చె మానకుము ప్రాప్త కవిత్వ పరిశ్రమంబులున్" (నా కథ)- అని జాషువా భుజం తట్టి కందుకూరి వీరేశలింగంగారు అన్న మాటలు జాషువాకు అదర్శాలయ్యాయి।

చక్కని కవితకు కులమే

యెక్కువ తక్కువలు నిర్ణయించినచో నిం

కెక్కడి ధర్మము తల్లీ?

దిక్కుం జరవేదికా ప్రతిష్టిత గాత్రీ

(ఖం।కా।భాగం-2, సందే)

అలాగే 1933-34 సం ల ప్రాంతంలో ఒకనాడు జాషువా వెంకటగిరి రాజైన యాచేంద్రభూపతిని సందర్శించటానికి రైల్లో వెళ్తున్నాడు। రైల్లో పరిచయమైన వ్యక్తి జాషువా కవి అని తెలుసుకొని అయన కవితలు విని ఎంతో సంతోషించాడు। జాషువాను ఎంతగానో అభినందించాడు। ఇంతలో ప్రసంగం కులంమీదకు మళ్లింది। జాషువాని ఆయన 'మీదే కుల'మని ప్రశ్నించాడు। జాషువా చెప్పాడు। అంతే అప్పటి వరకు జాషువాని పొడిగిన వ్యక్తే చివాలున లేచి వెళ్లిపోయాడు। గుండెను పిండే ఈ సంఘతననే జాషువా రాజుగారికి ఇలా చెప్పుకొని వాపోయాడు।


నా కవితావధూటి వదనంబు నెగాదిగ జూచి రూప రే

ఖా కమనీయ వైఖరులు గాంచి 'భళిభళి'! యన్నవాడె మీ

దే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో

బాకున గ్రుమ్మినట్లగును పార్థివచంద్ర! వచింప సిగ్గగున్


(ఖం।కా।భాగం-2)


ఇలాంటి సన్నివేశాలకు జాషువా జీవితంలో కొదవలేదు। అంతేకాదు, అన్నింటి కంటే విచిత్రమైంది - అటు క్రస్తవ సోదరులచేత విలివేయబడ్డడు। ఇటూ సవర్ణ హిందువుల చేత ఈసడింపబడ్డాడు। ఇంటి నుండి తరిమివేయబడ్డాడు। ఇదంతా కేవలం 'కులం కుట్రే'! కవిగా ఆయన లబ్దప్రతిష్టుడైన తర్వాత కూడా సభల్లో, సన్మానాల్లో ఈయన గురించి ప్రసంగించే వక్తలు 'పంచమ జాతిలో పుట్టి ఇంత గొప్పకవిగా రాణించినవాడు' అని అంటుంటే జాషువా గుండెలు అవిసిపోయేవి। 'నన్ను జాషువాగా ఇందుకు గుర్తించరు?' అని ఆయన అంటుండేవారట। ఇలా ఆయన జీవితంలో కుల ప్రాతిపదిక మీద ఎన్ని దూషణాల్ని, తిరస్కారాల్ని ఎదుర్కొన్నా, వాటిని లెక్కచేయలేదు। ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నాడు।

గవ్వకు సాటిరాని పలుగాకుల మూక లసూయ చేత న

న్నెవ్వెధి దూఱినన్ ననువరించిన శారద లేచిపోవునే

యవ్వసుధా స్థలిం బొడమరే రసలుబ్ధులు ఘంట మూనెదన్

రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద నాంధ్ర వాణికిన్

(నా కథ)

ఇలాంటి విశ్వాసంతో, మొక్కవోని ధైర్యంతో జాషువా తనను ఈసడించిన సమాజానికి ఎదురొడ్డి కవితలు రచించాడు। "విశ్వమానవ సౌభాతృత్వం, నిర్మత, నిర్జాతి సంఘం నా ఆదర్శం। ఒక జాతికి మతానికి చిందిన కవిత్వాలు మంచివి కావు। అవి కవిత్వాలు కావు। అలాటివి వీలునామా కవిత్వాలంటాను। నా భావం సామాన్యులకు అందివ్వడానికి ప్రయత్నించాను। గహన సంచారంలేని కవిత్వం నా లక్ష్యం" అది జాషువా వెల్లడించాదు। ఈ ఆదర్శంతోనే ఆయన తన కావ్యాలన్నీ రాశాడు। ముఖ్యంగా 'గబ్బిలం' కావ్యం। అవి ఆయన నిరాశ్రయుడిగా గుంటూరులో కాలం గడుపుతున్న రోజులు। ఒక పాడుబడిన ఇల్లు దొరికింది। అదీ స్మశానానికి పక్కనే। గబ్బిలాలకు ఆటపట్టయింది ఆ ఇల్లు। రాత్రిళ్ళు చిన్న ఆముదపు దీపం। ఆ అంధకారంలో ఆయనకి గబ్బిలాలే నేస్తాలు।

ముక్కు మొగమున్న చీకటి ముద్దవోలె

విహరణము సేయసాగె గబ్బిలమొకండు

దాని పక్షాని లంబున వాని చిన్ని

యాముదపు దేపమల్లన నారిపోయె


ఓ వైపు ఆత్మవ్యధ, మరోవైపు కటిక చీకటి। ఇంకో ప్రక్క గబ్బిలాల సంచారం। ఆ విపత్కర పరిస్థితిలో, ఆ ఆవేదనలో రూపుదిద్దుకొన్న ఆలోచనాధార ఫలితమే 'గబ్బిలం' కావ్యం। జాషువా జీవితానుభవ దృశ్యాలే 'గబ్బిలం' రచనకు ప్రత్యక్ష హేతువులు। అందువల్లే 'గబ్బిలం' లోని ప్రతి పద్యంలోనూ ఆత్మీయతా స్పర్శ తొణికిసలాడుతుంటుంది। జాషువా తన వైయక్తిక బాధని, తన జాతి జనుల సమిష్టి బాధని ప్రత్యేకించి పలికినా, అది సాధారణీకరణాన్ని పొందింది। సర్వపాథక సమాదరణాన్ని ప్రోది చేసుకుంది। తనకీ సమాజానికీ సామరస్యం కుదరలేదు। అంతర్భాహ్య సంఘర్షణల నుంచి కావ్యం ఆవిర్భవించింది। 'కవిత్వానికి బధ పర్యాయ పద'మంటారు। ఆ బాధ నుంచి విముక్తి చెందటానికే జాషువా గబ్బిలాన్ని కూర్చాడు।

'గబ్బిలం' కావ్యం పై రేడియో ప్రసంగం ఇక్కడ వినవచ్చు

No comments: