- డా, కఠెవరపు వెంకట్రామయ్య
అయితే ఇక్కడ చెప్పుకోవలసిన మరో విశేష లక్షణం జాషువాలో ఉంది। హైందవ సమాజంలోని దారుణమైన అస్పృశ్యతా సమస్యను చిత్రించిన జాషువా కవే పంచముల్లోని అంతర్భేదాల్ని ఎండాగడతాడు।
కలదమ్మా వ్రణమంటరానితన మాకర్ణింపు మీ ఇండియా
పొలమందుంగల మాలమాదిగలకున్ భూతేశుడే కాదు కృ
ష్ణులు, కృష్ణున్ని రసించు దైవములు క్రీస్తుల్, మస్తుగా బుట్టినన్
కలుపన్నేరరు రెండు జాతులను వక్కాణింప సిగ్గయ్యెడిన్
అని వ్యధ చెందుతాడు। అగ్ర వర్ణాల దౌష్ట్యాన్ని ఎంత నిర్భయంగా ఖండించాడో, అంతిమ వర్ణాల అజ్ఞానాన్ని అంత నిష్పాక్షికంగా నిరసించాడు జాషువా। ఒకవైపు స్వర్ణ హిందువుల దౌష్ట్యం పాము పడగలై బుసలు కొడుతుంటే, మాలలమనీ, మాదిగలమనీ 'ఐకమత్యాన్ని' మరచి కుమ్ములాటలో మునిగితేలే వారిని కలపటం ఎవరికీ సాధ్యం కాదని హెచ్చరిస్తాడు। అది నిజమే! కవి రాసిన అర్థశతాబ్దం తర్వాత కూడా ఆ స్థితిలో అడుగు ముందుకు వేయలేకపోవటానికి ఆత్మ విమర్శనం అవసరం కదా? కవ 'క్రాంరిదర్శి' అనటానికి వేరే నిదర్శనం కావాలా?
మత వైషమ్య నిరసనం, అస్పృశ్యతా నిరసనం, అంధ విశ్వాస నిరసనం, దారిద్ర నిరసనం అనే నాలుగు స్తంభాలపన జాషువా కవితా సౌధం నిలబడింది। ఆంతర్యాన్ని పరిశీలించటం, అసమానతను ప్రశ్నించడం, అన్యాయాన్ని ప్రతిఘటించడం - అయన కవిత్వానికి ఆయువు పట్టులు।
ముసుగులో గుద్దులాటలు పొసగవింక
హక్కు కలదయ్య ప్రశ్న సేయంగ నిన్ను!
అని సూటిగా భగవంతుణ్ణైనా ప్రశ్నిస్తాడు। ఈ చైతన్యంతో జాతి, మత, కుల శృంఖలాల్ని చేదించుకున్న జాషువా తాను "విశ్వనరుణ్ణి" అని ఉద్ఘాటిస్తాడు।
కులమతాలు గీచుకొన్న గీతల జొచ్చి
పంజరాన గట్టువడను నేను
నిఖిలలోకమెట్లు నిర్ణయించిన
నాకు తరుగులేదు విశ్వనరుడనేను
(ఖం।కా।భాగ।5.నేను)
కరుణ వీరరస కావ్యం:
అభ్యదయ కవిత్వంలో కరుణ వీరరసాలు సమ్యక్సమ్మేళనం చెంది కన్పిస్తాయి। భూత, వర్తమాన కాలాల్లోని సామాజిక అసమానతల్ని, దోపిడీని గుర్తించి, నిరూపించి॥ ఇప్పుడైనా వాస్తవాన్ని గ్రహించి, భవిష్యత్తులో ప్రగతి పథం వైపు - ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి సాగిపొమ్మని చెబుతుంది। అభ్యదయ కవిత। స్థితి నిరూపణలో కరుణం, మార్గనిర్దేశంలో వీరం - ఈ రకం కవితల్లో ధ్వనిస్తాయి। జాషువా తన కవితల్లో కరుణ రసం లోంచి వీరరసాన్ని పొంగించాడు।
కరుణరస మొండె కఠిన రాక్షసముల్
హృదయములను గలచి ముదము గూర్చు
వేడి కంటె నీటి విలువ సహజమైన
చలువ లీను అశ్రువులకు లేదు।
(ముసాఫర్లు)
జాషువా అక్షరాల్లో చిందే కన్నీళ్ళు అగ్నికణాలు। నిమ్నజాతుల కన్నీటి నీరదాలు పిడిగులై దేశాన్ని కాల్చివేస్తాయని నొక్కి వక్కాణించే విస్ఫులింగాలు। "తల వాక్రుచ్చగరాని నెత్తుటి సిరా"తో రాసిన గబ్బిలం 'ఇద్ద కరుణా పరిణద్దరస ప్రబంఢము"గా 'భాష్ఫ కణాభిరామము' గా రూపెత్తింది।
జనులం చీలిచి పిప్పిజేసెడు దురాచారంబులన్ గాల మ
ట్టని విద్యాబలమేల? విద్యయన మౌఢ్యవ్యాఘ్రి కింపైనచో
జనమా? మోసపు వ్రాతకోతలకు రక్షాబంధమా? ఎందుకీ
మనుజత్వంబు నొసంగలేని చదువుల్ మైరేయపుం మైకముల్
ఈ విధమైన భావచాలనం జాషువా కవిలోని ప్రతిఘటనాత్మక వైఖరిని పట్టి ఇవ్వటం లేదూ? 'ఉరము నిక్క గల్కి యుద్రేకమొదవించు నవ్యకవి'లాగా జాషువా విప్లవాన్ని ప్రకటించలేదు। సంయమనాన్ని ప్రకటించాడు।
ధర్మ సంస్థాపనార్థంబు ధరణిమీద
నవత రించెదననె నభవుని తండ్రి
మునువు జన్మించి నెత్తికెత్తినది లేదు
నేడు జన్మింపకున్న మునిగినది లేదు
అని ఖరాఖండిగ చెబుతాడు। శిష్ట రక్షణకు, దుష్ట శిక్షణకు యుగ యుగంలోనూ సంభవిస్తానన్న ఆ శ్రీమహావిష్ణువు తొమ్మిది అవతారాల్లో ఎంతమంది రాక్షసుల్ని సంహరించాడో కానీ, ఆ రాక్షసుల్ని మించిన అభినవ రాక్షసులు కులమతాలనే ఆయుధాలతో జనుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు। మరి వాళ్లని అంతం చేయటానికి ఆ శ్రీమహావిష్ణువు ఎప్పుడు పుడతాడో? అసలు పుడతాడా? పుట్టి ఒరగబెట్టింది ఇంతకు ముందులేదు। ఇక మీదట ఒరుగుతుందన్న నమ్మకం లేదు। అవకాశవాదులు తమ స్వార్థం కోసం కల్పించుకొన్నవే ఈ పురాణాలు, ఈ కథలు అని జాషువా తీర్పు।
'గబ్బిలం' కావ్యం పై రేడియో ప్రసంగం ఇక్కడ వినవచ్చు
No comments:
Post a Comment