- డా, కఠెవరపు వెంకట్రామయ్య
గబ్బిలం - ప్రతీక కావ్యం:
'గబ్బిలం ' ప్రతీక కావ్యం। (Symbolic poem) "కాళిదాసుని మేఘసందేశము మనస్సులో నుంచుకొని నేనీ కావ్యమును రచించితిని। గ్రంథ నామము గబ్బిలము। శ్రోతలకిది కటువుగా దోపవచ్చును। కాని యందలి కథా నాయకుడు ప్రణయ సందేశము నంపును। ఇత డంపునది తుక తుక నుడుకు నశ్రు సందేశము। అతని శిక్షా కాలపరిమితి యొక సంవత్సరము। ఇతని శిక్ష ఆజన్మాంతము। తర తరములు దీని కవధి లేదు। అతడు మన్మధాగ్ని తప్తుడు। ఇతడు క్షుధాగ్ని పీడితుడు। ఇరువురిలో నితడు దయనీయుడు"।
"గబ్బిలం" పీఠిక(విజ్ఞప్తి) లో జాషువా రాసిన మాటలివి। కవ మాటల్ని బట్టి, ఇతివృత్త నిర్వహణాన్ని బట్టి ఇది కాళిదాసు మేఘసందేశానికి అనుసరణ కావ్యమని స్పష్టమవుతుంది। అంటే సందేశ కావ్యం అన్నమాట। అక్కడ మేఘడు సందేశహరుడు। ఇక్కడ గబ్బిలం సందేశ హరిణి। ఇది సందేశ కావ్యమే అయినా, దీనిలో ప్రతీకవాద కవితా తత్త్వచ్చాయలు పుష్కలంగా వున్నాయి। 'గబ్బిలం' అరుంధతీ సుతునికి ప్రతీక। "పామునకు పాలు, చీమకు పంచదార"పోసి పోషించే హైందవ సమాజంలో గబ్బిలం మాత్రం ఒక "అపశకున పక్షి"గా పరిగణింపబడుతోంది। "మృగ పక్షిత్వ విచిత్ర ధర్మముక మూర్తిన్ని దాల్చియున్నట్టి నీ మోముంజూడదు లోకము" అని జాషువానే "ప్రాత పట్టింపు"లను ప్రస్తావించాడు। గబ్బిలాన్ని "వెలివేయబడిన" ప్రాణిగ ఇతర జాతులు కూడా గుర్తిస్తున్నాయి। ఈ లోక రీతిని పాటించే గబ్బిలాన్ని అరుంధతీ సుతుడికి ప్రతీకగా గ్రహించాడు జాషువా। అది విలుగు చూడాలేదు। పంచముల జీవితాల్లో వెలుగు లేదు। వారి చీకటి బతుకుల కది ఒక సంకేతం। వారి దైన్యానికీ, దయనీయతకీ గబ్బిలం తిరుగులేని ప్రతీక। సామాజిక దురన్యాయానికి బలై, సవర్ణ హిందువుల చేత వెలివేయబడిన పంచముని ఆక్రందన గబ్బిలం కావ్యానికి ఆయువు పట్టు।
తిరిపపు దమ్మిడీ తనివి దీపముగా వెలిగించి, దీపమే
యెరుగని నా కుటీరమున నృత్యమొనర్చు మహాపిశాచి, చిం
పిరితల చిక్కులమ్మ, తరి బీయతు జేసెడి నన్ను, భూమికిన్
బరువుగ గబ్బిలాయిగ! తృణంబుగ! జుల్కనగ! హుళక్కిగా
సమకాలీన సామాజిక దర్పణం:
ఒక కవి కవితాస్థాయిని చైతన్యాన్ని అతడు ఎంచుకొన్న వస్తువు, భావజాలం, అభివ్యక్తి నిర్దేశిస్తాయి। ఒక బలమైన సామాజిక భూమిక లేకపోతే, ఎంత గొప్ప కవిత్వం రాసినా అది నేల విడిచిన సామే అవుతుంది।
రచయిత మౌలికంగా సంఘజీవి। కాబట్టి అతని ఆలోచన ఎంత స్వతంత్రించినా, అది సంఘికమైనదే అవుతుంది। సమాజంలోని ఏ చలనానికైనా అప్రమత్తుడైన ఏ రచయిత (conscious writer) అయినా స్పందిస్తాడని చెప్పడం పరిపాటి। అలా నూటికి నూరుపాళ్ళు స్పందించి, కవిత లల్లినవాడు జాషువా। ఆయన గబ్బిలం సమాజంలో పుట్టింది। సమాజాన్ని ఎత్తి చూపింది। సామాజిక అసమానతలని చీల్చి చెండాడింది। మానవతకు అర్థం చాటి చెప్పింది।
జాషువా పుట్టే నాటికి(1895) భారతదేశం బానిసత్వంలో మగ్గుతోంది। బ్రిటిష్ సామ్రాజ్యవాదం బలం పుంజుకొంటోంది। ఆనాడు దేశం పరాయి పరిపాలనలో మగ్గడం అలా ఉండగా, సమాజం భయంకరమైన రుగ్మతులతో లుక లుక లాడిపోతూ వుంది।
స్వపరిపాల మన్న శబ్దంబు దేశంబు
వీనుల విందుగా వినకముందు
ఘన దురాచార సాగర మగ్నమై ప్రజా
బాహుళ్య మొడ్డున పడకముందు
కొలత గింజల శాసనంబులకు విరచి
కొట్లలో పంట తలదాచుకొనకముందు
ప్రభవ మందితి॥॥॥
అని జాషువా స్వీయచరత్ర "నా కథ"లో చెప్పుకున్నాడు। బాల్యం నుంచే బ్రిటిశ్ పెత్తందారి తనాన్ని నిరసించాడు।
సహింపదయ్యె శైశవమందె నా చిన్ని
చిత్తంబు తెలవారి పెత్తనంబు
అన్నాడు। తండ్రి "బాప్టిజాన్ని" (Baptism) పొంది తెల్లవారి దగ్గర పనిచేయటాన్ని జీర్ణించుకోలేకపోయాడు।
తానము నంది క్రైస్తవ మతంబున జేరి కులంబు గోత్రమున్
మానిన వెర్రిగొల్లడ వమాయక మూత్రివి॥॥।
జాషువాలోని ఈ దేశాభిమానం "గబ్బిలం" ద్వితీయ భాగంలో ప్రస్ఫుటమౌతుంది। ఈ భాగ రచనాకాలం నాటికి - "గాంధీ ఉద్యమం చేత సీమగడ్డకు కన్నులు చెమ్మగిల్లాయి, ముతక వస్త్రానికి మర్యాద పొటమరించింది। వడకు నూలు పగ్గాలు పేనించి వేటగాడు ఉచ్చులె వేశాడు। స్వరాజ్యమనే సింహరాజు అందులో చిక్కుకుంటాడే లేక తప్పించుకుంటాడో" అని సాలోచనగా అంటాడు। దీన్లో కూడా తన వ్యధని పలుకుతాడు।
జాతీయోద్యమ యుద్ధరంగ మహితోత్సాహ ప్రతిద్వానముల్
కూలీల్ బెట్టుచు నాల్గు జాతులకు గగ్గుర్పాటు గల్పించెడిన్
స్వాతంత్ర్యంబను స్వర్గసౌఖ్యమున మా భాగంబు మాకిత్తురో
ఖాతాలేదని త్రోసిపుచ్చెదరో! వక్కాణింపవే చెల్లెలా!
మెత్తని అధిక్షేపంతో హృదయానికి హత్తుకొనేటాట్లు చెప్పటం జాషువా కలం సొత్తూ। ఆయన అచ్చమైన గాంధేయవాది। కాబట్టే -
నిమ్నజాతుల కన్నీటి నీరదములు
పిడుగులై దేశమును కాల్చివేయు ననుచు
రాట్నమును దుడ్డుకర్ర కరానబూని
దెసల దోచె గుజరాతు ముసలి సెట్టి
అంటాడు। ఇలా దేశస్థితిని తెలియజేస్తూనే ప్రసక్తానుప్రసక్తంగా సామాజిక పరిస్థితిని వివరించాడు।
ఇక "గబ్బిలం" కావ్యానికి ప్రాణవాయువు సమకాలీన సంఘిక దుస్థితి। అనాది కాలం నుంచి మనిషికీ మనిషికీ మధ్య అడ్డుగోడలు పెట్టి, మానవతను మటుమాయం చేసిన వర్ణవ్యవస్థ "వేయి పడగ"లై విజృంభిస్తున్న కాలం అది। కులం, సంపద- వ్యక్తి సాంఘిక ప్రతిపత్తికి కొలబద్దలై మన్నుతున్న రోజులవి। "భారత వీరుడు" ఆ రెంటిని హరించి పంచముని పిప్పిచేస్తున్న దుర్భరస్థితి అది। ఎవరైతే తనను నిరాదరణకు గురిచేస్తున్నారో వారి "పాదము కందకుండ" చెప్పులు కుట్టి జీవనము సాగిస్తున్నాడు అరుంధతీ సుతుడు। అటువంటి వాని సేవకు భారతావని 'అప్పు పడ్డది'
వాడు చెమటోడ్చి ప్రపంచమునకు
భోజనము పెట్టు, వానికి భుక్తిలేదు
ఇదీ వాని స్థితి। అస్పృశ్యులు పండించే ధాన్యాన్ని ఆలయాలలో దేవునికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు। కానీ ఆ ధాన్యం పండించే వారికి మాత్రం ఆలయ ప్రవేశం లేదు। వ్యక్తి స్వేచ్చనూ, మానవతా విలువల్ని నాశనం చేస్తున్న మనిషికీ మనిషికీ అగాధాన్ని సృష్టిస్తున్న వర్ణవ్యవస్థ మీద ధ్వజమెత్తి సమతా సిద్ధాంతాన్ని ప్రబోధించాడు జాషువా।
'గబ్బిలం' కావ్యం పై రేడియో ప్రసంగం ఇక్కడ వినవచ్చు
1 comment:
Good going
Post a Comment