Monday, April 18, 2005

జాషువా ఆత్మకథాత్మక కావ్యం: గబ్బిలం (నాలుగు)

- డా, కఠెవరపు వెంకట్రామయ్య

ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు

నలువురు కుమారులనుట విన్నాముగాని

పసరము కన్న హీను డభాగ్యుడైన

యైదవ కులస్థు డెవరమ్మా! సవిత్రి


అసలే చాతుర్వర్ణ వ్యవస్థ। అందులో మరలా అయిదవ కులమని ఇంకో కుల మేమిటి? దీన్ని ఎవరు సృష్టించారు। సమాధానం లేనివి కావు ఈ ప్రశ్నలు। మన దేశంలోనే కాదు। ఇతర దేశాల్లో కూడా వర్ణ వైషమ్యాలు లేకపోలేదు। అయితే హైందవ సమాజంలో ఈ కులాల వ్యవస్థ "నిచ్చెన మెట్లు పద్ధతి" (Graded System)లో ఉండి - ఒక కులం అగ్రవర్ణం, మరో వర్ణం అథమ వర్ణం అని వరుసగా నిర్ణయించి ఆ చట్రంలో తరతరాలుగా మార్మికంగా, విరాటంకంగా దోపిడీ సాగిస్తున్న వాళ్ళని నిలదీస్తాడు జాషువా।

ఆ అభాగ్యుని రక్తంబు నాహరించి

యినుపగజ్జెల తల్లి జీవనము సేయు!

గసరి బుసకొట్టు నాతని గాలిసోక

నాల్గు పడగల హైందవ నాగరాజు


పాములకు గాలి ఆహారం అనేది జశ్రుతి। బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణములనే నాలుగు వర్ణాలను పడగలుగా కల్గిన హైందవ నాగరాజు, తాను వాయుభక్షకుడే అయినా - పంచముని గాలి సోకితే చాలట! కసరి బుసకొడతాడట। రేయింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసికొని, తమ అభ్యున్నతికి ఈ పంచముడైతే శ్రమిస్తున్నాడో, అతన్ని దరిచేరనీయకపోవటం, అస్పృస్యత సాకుతో దూరం చేయటం జాషువా హృదయాన్ని కలచివేశాయి। గుండె కుతకుతలాడింది। ఆ అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావానే 'గబ్బిలం' కావ్యం।

కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి

స్వార్థలోలురు నా భుక్తిననుభవింత్రు

కర్మమన నేమొ, దానికీ కక్షయేమొ

ఈశ్వరుని చేత ఋజువు చేయింపవమ్మ!


అని గబ్బిలాన్ని కోరుతాడు। హేతువాది, వాస్తవికతావాది అయిన జాషువా ప్రశ్న ఇది। ఔషధంలేని అస్పృశ్యతా జాడ్యానికి వ్యతిరేకంగా జాషువా సంధించి విడిచిన నిశిత బాణం ఇది। ఆయన ఆర్థిక చైతన్యానికీ, తాత్త్విక చైతన్యానికీ నిదర్శనాలు ఈ పంక్తులు। "సహజమైన ప్రకృతి సౌఖ్యంబు నొక వ్యక్తి దొంగిలించి మనుట దొసగు నాకు" అని దోపిడీ తత్వాన్ని సమాజిక అక్రమంగా గుర్తించిన జాషువా పతితులు, భ్రష్టులు, బాధాసర్ప దష్టులు అయిన పీడిత పంచమ జాతి పక్షపాతి।

ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుః

ఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలన్

మెదుకు విదల్పదీ భరత మేదిని ముప్పది మూడుకోట్లదే

వత లెగబడ్డ దేశమున భాగ్యవిహీతుల క్షుత్తులారునే


"వాని నిద్ధరించి భగవంతుడే లేడు మనుజుడెట్లు గనికరించు" అన్న అభిప్రాయాన్ని వ్యాఖ్యానిస్తున్నాయి పై పంక్తులు। గబ్బిలానికి మార్గనిర్దేశం చేసేటప్పుడు కూడా నీ ప్రయాణంలో సుడిగాడ్పులిదురైతే "నిలువవచ్చుం ధర్మసత్రాలలో పిడుగులు వడ్డ" అని చెబుతూ॥ ఎలాంటి ప్రాణాపాయ సమయంలోనైనా "ప్రవేశ యోగ్యతలు పాపిన్నాకు లేవచ్చటన్" అని "పులుగుంబుట్ర"కంటే హీనమైన పంచముని దుస్థితిని వ్యక్తీకరిస్తాడు। ఈ దేశంలో పషుపక్షాదులకున్న గౌరమన్నా పంచములకు లేదనటం జగమెరిగిన సత్యం।

వాని తలమీద బులిమిన పంకిలమును

గడిగి కరుణింప లేదయ్యె గగనగంగ


గంగ కల్మషహారిణి అంటారు। అ విషయంలో ఇక ఆకాశగంగ విషయం చెప్పనక్కరలేదు। మరి అలాంటి ఆకాశగంగ కూడా ఆ పంచముడి నెత్తిమీద హైందవ సమాజం పులిమిన బురదను కడిగి దయచూపలేదట। ఎంత అమానుషం! ఎంత క్రూరం!

ఈ వర్ణ వ్యవస్థలోని అక్రమాన్ని మరింత వ్యంగ్యంగా గబ్బిలంతో చెప్పే మాటల్లో చెబుతాడు॥

ఆలయంబున నీవు వ్రేలాడు వేళ

శివుని చెవి నీకు గొంతచేరువుగ నుండు

మౌని ఖగరాజ్ఞి! పూజారిలేని వేళ

విన్నవింపుము నాదు జీవిత చరిత్ర!


దేవుడు కురుణించినా "పూజారి" వరమియ్యడనేది పాత బడ్ద సామెత। "అమ్మా! గబ్బిలమా? శివిడికి పంచముల ఆక్రందనలు విన్నవించే సమయంలో పూజారి గనక విన్నాడంటే నీకు "ప్రాయశ్చిత్తం" తప్పదు। అంతెందుకు, పూజారికి ఆ పరమ్ శివుడు కూడా భయపడతాడు। నీవు విన్నవించే విషయం పూజారికి తెలిసిందని ఆ దేవదేవుడికి తెలిస్తే 'అతడు కూడా' నీమీద కోపగిస్తాడమ్మా! కాబట్టి పూజారి విషయం జాగ్రత్తగా చూసుకో" అని హెచ్చరిస్తాడు। ఇలా ప్రతి పద్యంలో జాషువా పాఠకుల కళ్ళముందు ప్రత్యక్షమవుతాడు। సామాజిక రంగంలోనే కాదు కాళారంగంలో కూడా "పుట్టరాని చోట పుట్టిన" కారణంగా తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపుతాడు జాషువా।

ఎంత కోయిల పాట వ్యధ యయ్యెనో కదా!

చిక్కు చీకటి వనసీమలందు,

ఎన్ని విన్నెలవాగు లింకి పోయెనో కదా!

కటిక కొండల మీద మిటకరించి,

ఎన్ని కస్తూరి జింక లీడేరెనో కదా!

మురికి తిన్నెల మీద పరిమళించి,

ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనో కదా!

పండిన వెదురు జొంపములలోన,

ఎంత గంధవహన మెంత తంగెటి జున్ను

ఎంత రత్నకాంతి ఎంత శాంతి

ప్రకృతి గర్భమందు! భగ్నమైపోయెనో

పుట్టరాని చోట పుట్టుకతన


"కవికోకిల" బిరుదాంకుతుడు జాషువా। ఆయన కవితా మాధుర్యాన్ని ఆస్వాదించిన వారే కోకిల 'పంచమ స్వరం'లో కూస్తుందని శ్లేషల్ని ఆశ్లేషించి, భాషా ప్రౌఢిమ ప్రదర్శించి, తమ అక్కసు చాటుకోలేదా? అయినా సాహితీ ప్రియుల హృదయ ఫలకల మీద తన ముద్రను భద్రపరుచుకొన్నాడనేది ఎవరూ కాదనలేని వాస్తవం। అయినా సృజనాత్మకత(creativity)కి కూడా కులమతాల మలాములంటించిన 'భారతీయత'కు మంగళహారతులు పట్టవలసిందే మరి!

'గబ్బిలం' కావ్యం పై రేడియో ప్రసంగం ఇక్కడ వినవచ్చు

No comments: