Wednesday, January 14, 2009

భూదేవి బుగ్గల సిగ్గులు


ఇవి 2005 సంక్రాంతికి, మా పాత రీలు కెమేరాతో తీసిన ఫోటోలు...


Sankranti 05 muggu : అమ్మ ఆవు
భూదేవి బుగ్గల సిగ్గులు
మా అమ్మ రంగుల ముగ్గులు

Sankranti 05 muggu : ఆవు
మా ఇంటి కొచ్చె గోమాత
సిరిసంపదలిచ్చు భాగ్యదాత

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

వరంగల్ ← ఓరుగల్లు ← ఒరు + కల్ !!! తమిళ్ ??

మొన్నటి హిందు వార్త పత్రిక మెట్రొప్లస్ అనుబంధంలో వరంగల్ గురించి ఒక వ్యాసం ప్రచురించారు. అందులో వరంగల్ పూర్వ నామం ఓరుగల్లు అని, ( తెలిసిన విషయమే ) ఏకశిలానగరమనీ ( ఇదీ చదువుకున్నదే ) చెప్తూ, ఓరుగల్లు అన్న పేరు ఒరు + కల్ అన్న పేరుకి రూపాంతరం అని వుంది !!! అరె, ఇది తెలీదే !!! చిన్నప్పుడు వరంగల్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాను, పెద్దయ్యాక నాలుగేళ్లు వరంగల్లోనే చదువుకున్నాను, అయినా కూడా ఎప్పుడూ ఈ విషయం తట్టలేదు, తెలియలేదు !!! మనకు చాలా అనుబంధం ఉన్న దాని గురించి, బాగా దగ్గరైన దాని గురించి ఓ కొత్త విషయం తెలిస్తే ఇలానే ఉంటుందేమో.....

సరే, ఇక విషయానికి వద్దాము. నిజమే, ఓరుగల్లు అన్నది ఒరు + కల్ అన్నదానికి రూపాంతరమన్న విషయం అంగీకరింపదగినదే. అర్థపరంగా, తమిళంలో ఒరు = ఒక, కల్ = రాయి/శిల కూడా సరైనదే. పైగా, వరంగల్లుకి ఏకశిలానగరమనే పేరుకూడా జగద్విదితమే. మరయితే, మన వరంగల్ తమిళ మూలంతో ముడిపడిన ఊరా? కల్ అన్న పదం ఒక్క తమిళంలోనే కాదు, కన్నడ, మలయాళంలో కూడా రాయి అన్న అర్థంలో వాడతారు. అంతే కాకుండా మన ఆంధ్రదేశంలో కూడా అక్కడక్కడ (ఎక్కడ??) రాళ్లుప్పుని కల్లుప్పు అని వ్యవహరించడం కద్దు. సి.పి. బ్రౌణ్ నిఘంటువులో కూడా రాయితో బాటు కల్లు అన్న పదం ఉంది. కాబట్టి తమిళ మూలం కాదందామా? కాని, ఒరు అన్న పదం తమిళం కదా, కాబట్టి వరంగల్లు ఊరికి ముందెప్పుడో తమిళ ములాలు ఉన్నాయా? ఈ ఉరుకి తమిళానికి లంకె నాకయితే అంతుపట్టట్లేదు.

ఈ విషయం ఆలోచిస్తుంటే, ఇంకో ప్రశ్న కూడా పుట్టింది. కల్ అన్న శబ్దం మిగిలిన మూడు ద్రావిడ భాషల్లోను రాయికి వాడుతున్నారు. కాబట్టి కల్ అన్న పదానికి ద్రావిడ మూలం ఉండేవుంటుంది. సంస్కృతంలోనేమో శిల అంటాము, హిందీలో పత్థర్ అంటాము. మరి, మనం తెలుగులో వాడే "రాయి"కి మూలమేమిటి? దీనిబట్టి, రాయి అన్నది అచ్చ తెలుగు పదమా?

ప్రస్తుత విషయానికి కాస్త అప్రస్తుతమైనా.... వరంగల్ గురించి, కాకతీయ సామ్రాజ్యం గురించి తలుచుకున్నప్పుడల్లా ఓ ఆలోచన కలుగుతుంటుంది. అసలు కాకతీయ సామ్రాజ్యం ఏ పద్దెనిమిదో శతాబ్దం దాకానో కొనసాగుంటేనా, మన తెలుగు - ఆంధ్ర కీర్తి ఇంకోలా ఉండేదమో.... ఇంకో సెట్టు అష్టదిగ్గజాలు, ఓ నలుగురైరుదుగు శ్రీనాథులు, అరడజను రామప్ప, వేయిస్థంభాల గుళ్లు, ఓ రెండు మూడు పేద్ద కోటలు, కీర్తి తోరణం లాంటి ఇంకొన్ని గొప్ప శిల్ప సంపదలు .......

అన్నింటికీ మించి, ఈ తెలంగాణా ఆంధ్ర అనే బేధభావాలకి తావే ఉండేది కాదు కదా.....

హెప్చ్, కాని ఇది చరిత్ర, మనం మార్చలేము కదా.

Thursday, January 01, 2009

శ్రీవారికి (సత్యభామ) ప్రేమ లేఖ

ఈ మధ్య మా స్నేహితుల మధ్య మాటల్లో (mails లో) "శ్రీవారికి ప్రేమలేఖ" చిత్రంలో హీరోయిన్ లేఖ రాసే పాట ప్రస్తావనకి వచ్చింది. జానకి గారు పాడిన తీరు, ఆ పాటని చిత్రీకరించిన విధానం చాలా బావుంటాయి. అయితే, విషయమేమిటంటే, ఆ పాట మొదట్లో వచ్చే లేఖకి ప్రేరణ సత్యభామ రాసిన లేఖ. కూచిపూడి సంప్రదాయానికి మకుటాయమానమైన భామాకలాపం లో సత్యభామ రాసే లేఖే ఈ ప్రేమ లేఖ.

అభిరుచి ఉన్నవారికోసం ఆ లేఖ పూర్తి పాఠం క్రింద పొందుపరిచాను. దాని కన్నా ముందు, ఆ లేఖని (abridged version) వినండి.


-------------------------------------------------------------------------
శ్రీమద్ రత్నాకర పుత్రికా ముఖారవింద మరందపాన వినిశిత మిళిందాయమాన.....

శ్రీరాజగోపాలస్వామి వారి చరణారవిందములకు సత్యభామ నిటల ఘటిత కరకమలయై అనేక సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి, శాయంగల విన్నపములు........

మజ్జనకుండగు సాత్త్రాజిత్తు నన్ను మీకిచ్చి వివాహంబొనరించిన ప్రభృతి, వజ్రవైఢూర్య నీలగోమేధిక పుష్యరాగ స్తగిత నానావిధ చిత్రవిచిత్ర జంబూనద రత్న నిర్మితంబగు హంసతూలికా తల్పంబున దివ్యమంగళవిగ్రహాకారులై గాఢాలింగనంబొనరించి, ఉపరతి సమరతులన్ దేలుచున్న సమయంబున తమ చిత్తంబా రుక్మిణీ సతియందు సంపూర్ణముగా నునిచి ప్రాణసఖి యగు నాయందు నిర్దయత్వంబున కఠిన మనస్కులై విడనాడియున్న నాటినుండి, మారుండు క్రూరుండాయె, మలయానిలుండు కాలాంతకుండాయె, తుమ్మెదలు తలద్రిమ్ముపుట్టించె, చంద్రుండు అనలుండాయె. నన్నీ క్రూరాత్ములబారిన్ బడద్రోసి మన్మందిరమ్మునకు విచ్చేయక, నావంటి అబల యెడ చలముబూనుట ధర్మంబుకాదూ.......

కాన, నన్ను కరుణించి ఇచటకు విచ్చేసి మకరకేతన కేళిన్ దనిపి సంతసం బొనరింప ప్రార్థింతుదాన.....

చిత్తజుని బారికోర్వక త్తతరబడి వ్రాసినాను, తప్పో ఒప్పో చిత్తమున కోపముంచక ఇత్తరి బ్రోవంగ రావె ఇవియే ప్రణతుల్.....
ఇట్లు నీ ప్రాణ సఖి
--- సత్యభామ.
----------------------------------------------------------------------------------

మరి, ఇంత పెద్ద లేఖ చదివాక ఫలశృతి లేక పోతే ఎలా?
ఫలశృతి: తెలుగు బ్లాగు బ్రహ్మచారులందరికీ తమ తమ అభీష్ట సత్యభామలు శీఘ్రమే సిద్ధిరస్తు. తథాస్తు :-)

మరైతే, ఈ టపా బ్రహ్మచారులకేనా అనడుగుతారా? మాలాంటి, కాదు కాదు మనలాంటి గృహస్తులకేమి లేదా? ఎందుకు లేదు, మనలాంటి వాళ్లకి ఆదర్శమైన రాముడుండనే ఉన్నాడుగా. ఈ మధ్యనే మా స్నేహితుని ద్వారా దొరికిన ఇళయారాజ ఆణిముత్యం, ఆ సీతారాముల మీద ఓ అద్భుతమైన పాట మనందరి కోసం.....పైన ఇచ్చిన పాట పూర్తిగా ఇక్కడుంది.

పనిలో పనిగా, అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికై మొన్నీమధ్యనే హైదరాబాదులో దిగ్విజయంగా జరిగిన కార్యక్రమం కలిగించిన ఆనందంతో, ఈ కృషి ఇంతింతై, వటుడింతై అన్నచందాన మరింత వృద్ధి చెందాలని కోరుకుంటూ, అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.