Wednesday, January 14, 2009

వరంగల్ ← ఓరుగల్లు ← ఒరు + కల్ !!! తమిళ్ ??

మొన్నటి హిందు వార్త పత్రిక మెట్రొప్లస్ అనుబంధంలో వరంగల్ గురించి ఒక వ్యాసం ప్రచురించారు. అందులో వరంగల్ పూర్వ నామం ఓరుగల్లు అని, ( తెలిసిన విషయమే ) ఏకశిలానగరమనీ ( ఇదీ చదువుకున్నదే ) చెప్తూ, ఓరుగల్లు అన్న పేరు ఒరు + కల్ అన్న పేరుకి రూపాంతరం అని వుంది !!! అరె, ఇది తెలీదే !!! చిన్నప్పుడు వరంగల్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాను, పెద్దయ్యాక నాలుగేళ్లు వరంగల్లోనే చదువుకున్నాను, అయినా కూడా ఎప్పుడూ ఈ విషయం తట్టలేదు, తెలియలేదు !!! మనకు చాలా అనుబంధం ఉన్న దాని గురించి, బాగా దగ్గరైన దాని గురించి ఓ కొత్త విషయం తెలిస్తే ఇలానే ఉంటుందేమో.....

సరే, ఇక విషయానికి వద్దాము. నిజమే, ఓరుగల్లు అన్నది ఒరు + కల్ అన్నదానికి రూపాంతరమన్న విషయం అంగీకరింపదగినదే. అర్థపరంగా, తమిళంలో ఒరు = ఒక, కల్ = రాయి/శిల కూడా సరైనదే. పైగా, వరంగల్లుకి ఏకశిలానగరమనే పేరుకూడా జగద్విదితమే. మరయితే, మన వరంగల్ తమిళ మూలంతో ముడిపడిన ఊరా? కల్ అన్న పదం ఒక్క తమిళంలోనే కాదు, కన్నడ, మలయాళంలో కూడా రాయి అన్న అర్థంలో వాడతారు. అంతే కాకుండా మన ఆంధ్రదేశంలో కూడా అక్కడక్కడ (ఎక్కడ??) రాళ్లుప్పుని కల్లుప్పు అని వ్యవహరించడం కద్దు. సి.పి. బ్రౌణ్ నిఘంటువులో కూడా రాయితో బాటు కల్లు అన్న పదం ఉంది. కాబట్టి తమిళ మూలం కాదందామా? కాని, ఒరు అన్న పదం తమిళం కదా, కాబట్టి వరంగల్లు ఊరికి ముందెప్పుడో తమిళ ములాలు ఉన్నాయా? ఈ ఉరుకి తమిళానికి లంకె నాకయితే అంతుపట్టట్లేదు.

ఈ విషయం ఆలోచిస్తుంటే, ఇంకో ప్రశ్న కూడా పుట్టింది. కల్ అన్న శబ్దం మిగిలిన మూడు ద్రావిడ భాషల్లోను రాయికి వాడుతున్నారు. కాబట్టి కల్ అన్న పదానికి ద్రావిడ మూలం ఉండేవుంటుంది. సంస్కృతంలోనేమో శిల అంటాము, హిందీలో పత్థర్ అంటాము. మరి, మనం తెలుగులో వాడే "రాయి"కి మూలమేమిటి? దీనిబట్టి, రాయి అన్నది అచ్చ తెలుగు పదమా?

ప్రస్తుత విషయానికి కాస్త అప్రస్తుతమైనా.... వరంగల్ గురించి, కాకతీయ సామ్రాజ్యం గురించి తలుచుకున్నప్పుడల్లా ఓ ఆలోచన కలుగుతుంటుంది. అసలు కాకతీయ సామ్రాజ్యం ఏ పద్దెనిమిదో శతాబ్దం దాకానో కొనసాగుంటేనా, మన తెలుగు - ఆంధ్ర కీర్తి ఇంకోలా ఉండేదమో.... ఇంకో సెట్టు అష్టదిగ్గజాలు, ఓ నలుగురైరుదుగు శ్రీనాథులు, అరడజను రామప్ప, వేయిస్థంభాల గుళ్లు, ఓ రెండు మూడు పేద్ద కోటలు, కీర్తి తోరణం లాంటి ఇంకొన్ని గొప్ప శిల్ప సంపదలు .......

అన్నింటికీ మించి, ఈ తెలంగాణా ఆంధ్ర అనే బేధభావాలకి తావే ఉండేది కాదు కదా.....

హెప్చ్, కాని ఇది చరిత్ర, మనం మార్చలేము కదా.

16 comments:

నేస్తం said...

:)meeru cheppindi kooda correcte.. chinnapudu books lo orugallu gurinchi chadivinappudallaa naa manasu lo chaalaa uvvillu uredaanni chudaalani

ఏకాంతపు దిలీప్ said...

oNDorulu = each other,
ఈ పదంలో "ఒరు" ఉంది, కాబట్టి తెలుగుకి సంభందించినదే అయి ఉంటుంది...

ఏకాంతపు దిలీప్ said...

ఇక్కడ చూడండి...
http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=205&table=brown&display=utf8

ఏకాంతపు దిలీప్ said...

ఒరుడు,ఒండొరులు onḍ-orulu. (ఒండు+ఒరుడు)
రెండు పదాలు ఆ లంకె లో ఉన్నాయి...

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

@దిలీప్ గారు: వెంటనే స్పందించి, ఇంకొన్ని వివరాలిచ్చినందుకు నెనర్లు. అయితే, మీరు చూపిన ఉదాహరణ oNDorulu = each other, లో ఉన్న "ఒరు" తెలుగులో "ఇతరులు" అన్న అర్థంలో వాడతారనుకుంటానండి.

"ఒరులేయవి యొనరించిన" అన్న భారత పద్యంలోని ఒరులు కూడా ఇతరులు అన్న అర్థంలో వాడబడింది.

కన్నగాడు said...

నిజమే ఓరుగల్లు అనేది తమిళపదం ఎలా ఏకశిల అనే పేరును కనుమరుగు చేసిందో తెలీదు. ఇంకో విషయమేమిటంటే ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని పరిపాలించిన రాజవంశీయులు ముగ్గురే అందులో కాకతీయులు ఒకరు, శాతవాహనులు మూడో వంశం ఎవరో గుర్తులేదు.

ఏకాంతపు దిలీప్ said...

హర్ష గారు
ఇది చూడండి... అదే లంకే లో..

ఒండు [ oṇḍu ] onḍu. [Tel.] n. One ఏకము. An individual. ఒకడు. Another. అన్యము. ఒండేమితెలియక not knowing a single thing. ఒండననేల why should you say anything? ఒండె or ఒండేని onḍē. (ఒండె+ఏని) if it is not so, అట్లు కానియెడల. ఒండెడ onḍ-eḍa. adv. Elsewhere. ఒండొండ onḍ-oṇḍa. (ఒండు+ఒండు+అ.) adv. One by one, continuously. Gradually. క్రమక్రమముగా. ఒండొండపారుచు flowing on continuously ఒండొంటికి onḍ-onṭi-ki. To one another. ఒకదానికొకటి. ఒండొరులు onḍ-orulu. (ఒండు+ఒరుడు) n. Each other. ఒకరికొకరు.


ఒకరికి ఒకరు అర్ధం లో కూడా వాడారు...

నాకున్న కొంచెం అవగాహనతో ఒండు అనేది ఒరుకి వికృతి అనుకుంటున్నాను... అది వికృతమే అయితే సరిగ్గా సరిపోతుంది అర్ధం.

జిగురు సత్యనారాయణ said...

తెలుగులో "గల్లుప్పు" (Raw Salt)అనే పదము ఉన్నది. కాబట్టి "గల్లు" అనే పదమే తెలుగు పదమే అయ్యుంటుంది.

శ్రీ said...

చాలా ఆసక్తికరంగా రాసారు. దిలీప్ గారు మంచి సమాచారం అందించారు.

కల్లుప్పు ప్రయోగం మా వైపు ఇంకా వాడుతారు.అంటే ఒరుకల్లు కాస్తా ఓరుగల్లు గా మారిందనమాట.

Naga said...

"ఓరకంట చూసింది" అని ఎక్కడో చదివే ఉంటారు కదా! పాత తెలుగులో ఉంది అదే విధంగా కల్ అనే పదం కూడా పాత తెలుగులో ఉన్నది. గట్టిగా అంటే ఇది కూడ తమిళ దేశమే అని వాదించే వాళ్ళకు వినిపిస్తుంది, ష్....! :)

విశేషం ఏమిటంటే ఐన్‌స్టీన్ అనే పదానికి కూడా ఓరుగల్లు అనే అర్ధం...? అంటే ఐన్‌స్టీన్ కూడా...

ఏకాంతపు దిలీప్ said...

నాగన్న గారు,
"ఓరకంట చూసింది... " తిరుగులేని ఉదాహరణ.. నెనర్లు...

రాఘవ said...

కల్లు అన్నది రాయి అన్న అర్థంలో వాడే మరో తెలుగుపదం సన్నెకల్లు. ఇంకా ప్రయోగాలు ఏమైనా ఉన్నాయేమో నాకు ప్రస్తుతానికి తట్టడంలేదు.

తమిళంనుంచి తెలుగు వచ్చిందా లేదా తెలుగునుండి తమిళం పుట్టిందా వంటి ప్రశ్నలు పక్కన పెడితే అచ్చతెలుగు పదాలూ తమిళ పదాలూ చాలామటుక్కు ఒక్కలాగానే ఉంటాయి.

కామేశ్వరరావు said...

రాయి అన్నదానికి ద్రవిడ భాషా మూలం "అఱై" - అంటే నూఱడం, నూఱడానికి ఉపయోగించే రాయి.
"ఓరకంట"లో "ఓర" అంటే ఒకటి అనికాదు. దీనికి కొస, అంచు, వాలు మొదలైన అర్థాలు.
తెలుగు భాష కూడా తమిళంలానే ద్రవిడ భాషనుంచి పుట్టింది కాబట్టి చాలా పదాలకి ద్రవిడ భాషలో మూలాలు కనిపిస్తాయి. తమిళ భాషలో కన్నా తెలుగులో ఎక్కువ మార్పు కనిపిస్తుంది. కాబట్టి కొన్ని పదాలు తమిళం నుండి వచ్చాయని భ్రమపడుతూ ఉంటాం. "ఒరు", "కల్లు" కూడా అలాంటివే.
అచ్చమైన (ద్రవిడ భాషా మూలం కనిపించని) తెలుగు పదానికి ఒక ఉదాహరణ "నోరు" అనుకుంటాను.

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

@భైరవభట్ల కామేశ్వర రావు గారు: ధన్యవాదాలండి, చక్కటి వివరణ అందించినందుకు. ముఖ్యంగా, "రాయి" పదం గురించి ఇప్పుడు అర్థమయ్యింది.

మీరు చెప్పిన ఇంకో విషయం కూడా అవగాహనలోకొచ్చింది. ఒరు, కల్: ఇవి ద్రవిడ భాషా మూలాలు అని అర్థంచేసుకోవడం సమంజసం. నేను ద్రవిడ భాష = తమిళం అన్నలాగా జమకట్టేసి, కాబట్టి వరంగల్లుకి తమిళానికి లంకె ఉండచ్చు అన్న అభిప్రాయాలు వెలిబుచ్చాను.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

కొన్ని ఊళ్ళ పేర్లు, తెలుగు-తమిళాలు విడిపోకముందు ఏర్పడ్డవి. "ఒరు" కి " ఒకటి అనే అర్థమని నేను నమ్ముతున్నాను. ఒరు+క = ఒక్క అయింది. అంతేతప్ప అక్కడ తమిళులు నివసించారని కాదు, లేదా అది తమిళుల అధీనంలో ఉండేదని కూడా కాదు.

Sravan Kumar DVN said...

'kal' dravida bhashalnnitlo undani mire annaru, so ikkada tamillanni ooo puratanamainadi chesi cheppanakkarledu. anni bhashalaki edo mulam undi untundi. andukani orugallu , tamil nunchi vachchindi ane vadana,,, TV9 lo nes laga untundi.