Thursday, January 01, 2009

శ్రీవారికి (సత్యభామ) ప్రేమ లేఖ

ఈ మధ్య మా స్నేహితుల మధ్య మాటల్లో (mails లో) "శ్రీవారికి ప్రేమలేఖ" చిత్రంలో హీరోయిన్ లేఖ రాసే పాట ప్రస్తావనకి వచ్చింది. జానకి గారు పాడిన తీరు, ఆ పాటని చిత్రీకరించిన విధానం చాలా బావుంటాయి. అయితే, విషయమేమిటంటే, ఆ పాట మొదట్లో వచ్చే లేఖకి ప్రేరణ సత్యభామ రాసిన లేఖ. కూచిపూడి సంప్రదాయానికి మకుటాయమానమైన భామాకలాపం లో సత్యభామ రాసే లేఖే ఈ ప్రేమ లేఖ.

అభిరుచి ఉన్నవారికోసం ఆ లేఖ పూర్తి పాఠం క్రింద పొందుపరిచాను. దాని కన్నా ముందు, ఆ లేఖని (abridged version) వినండి.










-------------------------------------------------------------------------
శ్రీమద్ రత్నాకర పుత్రికా ముఖారవింద మరందపాన వినిశిత మిళిందాయమాన.....

శ్రీరాజగోపాలస్వామి వారి చరణారవిందములకు సత్యభామ నిటల ఘటిత కరకమలయై అనేక సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి, శాయంగల విన్నపములు........

మజ్జనకుండగు సాత్త్రాజిత్తు నన్ను మీకిచ్చి వివాహంబొనరించిన ప్రభృతి, వజ్రవైఢూర్య నీలగోమేధిక పుష్యరాగ స్తగిత నానావిధ చిత్రవిచిత్ర జంబూనద రత్న నిర్మితంబగు హంసతూలికా తల్పంబున దివ్యమంగళవిగ్రహాకారులై గాఢాలింగనంబొనరించి, ఉపరతి సమరతులన్ దేలుచున్న సమయంబున తమ చిత్తంబా రుక్మిణీ సతియందు సంపూర్ణముగా నునిచి ప్రాణసఖి యగు నాయందు నిర్దయత్వంబున కఠిన మనస్కులై విడనాడియున్న నాటినుండి, మారుండు క్రూరుండాయె, మలయానిలుండు కాలాంతకుండాయె, తుమ్మెదలు తలద్రిమ్ముపుట్టించె, చంద్రుండు అనలుండాయె. నన్నీ క్రూరాత్ములబారిన్ బడద్రోసి మన్మందిరమ్మునకు విచ్చేయక, నావంటి అబల యెడ చలముబూనుట ధర్మంబుకాదూ.......

కాన, నన్ను కరుణించి ఇచటకు విచ్చేసి మకరకేతన కేళిన్ దనిపి సంతసం బొనరింప ప్రార్థింతుదాన.....

చిత్తజుని బారికోర్వక త్తతరబడి వ్రాసినాను, తప్పో ఒప్పో చిత్తమున కోపముంచక ఇత్తరి బ్రోవంగ రావె ఇవియే ప్రణతుల్.....
ఇట్లు నీ ప్రాణ సఖి
--- సత్యభామ.
----------------------------------------------------------------------------------

మరి, ఇంత పెద్ద లేఖ చదివాక ఫలశృతి లేక పోతే ఎలా?
ఫలశృతి: తెలుగు బ్లాగు బ్రహ్మచారులందరికీ తమ తమ అభీష్ట సత్యభామలు శీఘ్రమే సిద్ధిరస్తు. తథాస్తు :-)

మరైతే, ఈ టపా బ్రహ్మచారులకేనా అనడుగుతారా? మాలాంటి, కాదు కాదు మనలాంటి గృహస్తులకేమి లేదా? ఎందుకు లేదు, మనలాంటి వాళ్లకి ఆదర్శమైన రాముడుండనే ఉన్నాడుగా. ఈ మధ్యనే మా స్నేహితుని ద్వారా దొరికిన ఇళయారాజ ఆణిముత్యం, ఆ సీతారాముల మీద ఓ అద్భుతమైన పాట మనందరి కోసం.....



పైన ఇచ్చిన పాట పూర్తిగా ఇక్కడుంది.

పనిలో పనిగా, అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికై మొన్నీమధ్యనే హైదరాబాదులో దిగ్విజయంగా జరిగిన కార్యక్రమం కలిగించిన ఆనందంతో, ఈ కృషి ఇంతింతై, వటుడింతై అన్నచందాన మరింత వృద్ధి చెందాలని కోరుకుంటూ, అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

4 comments:

Disp Name said...

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు Mee Blaagu Chaala Baagundi.

వేణూశ్రీకాంత్ said...

హర్ష గారూ, కొత్త సంవత్సరం రెండు అద్భుతమైన పాటలని మళ్ళీ స్మరింప చేసినందుకు థ్యాంక్యూ.. సత్యభామ గారి లేఖ గురించి విన్నాను కాని పూర్తి పాఠం తెలియదు. ఇక్కడ పొందు పరచినందుకు మరో థ్యాంక్యూ. మీకూ మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Purnima said...

ఈ పాటలను ఇక్కడ పొందుపరిచినందుకు ధన్యవాదాలు!

నూతన సంవత్సర శుభాకాంక్షలు!

పూర్ణిమ

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

@Zilebi, వేణూ శ్రీకాంత్, పూర్ణిమ: మీ అందరికీ ధన్యవాదాలు.