Saturday, January 02, 2010

శబ్దార్థ సర్వస్వం - 3,80.000 పేజీల వ్రాత ప్రతి

ఓ వేమన పద్యం (గుణయుతునకు) కోసం గూగులమ్మని అడగ్గా అది మూడు ఫలితాలన్నిచ్చింది. వాటిలో రెండు ఫలితాలు "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంధాలయం & పరిశోధనాలయం" వారి వెబ్సైటులోవి. ఈ వెబ్సైటుని నేను మొదటి సారి చూస్తున్నాను. ఇదేదో విలువైన భాండాగారమల్లే వుందే అని దానిని చూడ్డం మొదలెట్టాను.అక్కడే కనిపించింది నాకు, "శబ్దార్ధ సర్వస్వం".

"శ్రీ పరవస్తు వెంకట రాంగాచారి గారి శబ్దార్ధ సర్వస్వం అనే సంస్కృత రచనని సర్వ సంగ్రహ నిఘంటువుగా పేర్కొనవచ్చును. ఈ రచన అన్ని విషయాల గురించి సంస్కృత భాషలో విశదపరుస్తుంది. ఈ రచన కాస్తకాస్తగా ముప్పై అయుదేళ్ల కాలావధిలో రాస్తూ పోయినప్పటికీ, ఆయన తన జీవితకాలంలో పూర్తి చేయలేకపోయారు. ఈ పుస్తకం అచ్చయి ఉండి ఉంటే సంస్కృత భాషకే తలమానికమయ్యేది, శాశ్వతంగా నిలిచేది" అని ఈ పుస్తక పరిచయంలో అక్కడ రాసారు.

బావుంది, అని ఇంకాస్త లోతుల్లోకి వెళ్లాను. అక్షరాలా మూడు లక్షల ఎనభై పేజీల వ్రాత ప్రతి !!! 1865లో ప్రారంభించి ముప్పైఐదేళ్ల పాటు కొంచెం కొంచెంగా రాస్తూ కూడా అసంపూర్ణంగా మిగిలిపోయిందిట. ఈ ఉద్గ్రంధాన్ని ఈ సంస్థ digtise చేస్తోంది. ఇప్పటికి నూటయాభై భాగాలుగా digtise చేసారు. ఈ పుస్తకం సంస్కృత పుస్తకమే అయినా, అది రాసినది తెలుగు లిపిలో. ప్రయత్నిస్తే, ఆ చేతిరాత చాలా మటుక్కు నేను (తెలుగు చేతి రాత చదివి, రాసి ఓ పుష్కర కాలమయ్యింది) కూడబలుక్కుని చదవగలుగుతున్నాను. నేను చూసిన ఓ 10-15 పేజీల వరకు, పుస్తకం కూడా బాగానే కాపాడిపడినట్టు లెక్క.

కేవలం అ, ఆ అక్షరాల వరకు దీనిని అచ్చేసారుట. దానికే 650 పేజీలయ్యాయి. ఆ అచ్చు పుస్తకంకూడా వీరి దగ్గర వుంది.





35 సంవత్సరాల్లో 3,80,000 పేజీలంటే, దాదాపు రోజుకి ముప్పై పేజీలు రాసారన్నమాట ఆ మహానుభావుడు. ఈ పుస్తకం ఎంత గొప్పదో ఊహించడానికి కూడా నాకు అర్హత లేదేమో అనిపిస్తోంది. ఈ కొత్త సంవత్సరం నేను తీసుకున్న నిర్ణయం, ఉస్మానియా విశ్వవిద్యాలంలో ఉన్న ఈ సంస్థకి వెళ్లి ఈ పుస్తకాన్ని చూసిరావాలి.

ఈ పుస్తకం మొత్తం చేతనయినంత తొందరగా వీకీ మూలం లాంటి చోటుకి చేరి, యావత్ప్రపంచానికీ వెతికేందుకు అందుబాటులోకి రావాలని ఆకాంక్ష.



ఇప్పటివరకూ digitise చేయబడిన నూటయాభై భాగాలు.

1 comment:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

ఎంతోగొప్ప విషయం చెప్పారు.
శబ్దార్థ సర్వస్వం = పేరు కూడా చక్కగా కుదిరింది.
మా అబ్బాయి వికీపీడియా అభిమాని.
అయితే అప్పట్లోనే ఇలాంటి ఒక గ్రంధం తయారుచేయాలని అనుకున్న రంగాచారి గారికి నా నమస్సులు. (చాలా ఆలస్యంగా..)
మీకు నా కృతఙ్ఞ్నతలు.