Wednesday, October 27, 2010

తెలుగు != ఉద్యోగావకాశాలు ?? ఎల్లప్పుడూ కాదు

ఇవాళ హిందు దినపత్రికలోని ఉద్యోగావకాశాల ఎడిషన్ లో ఈ ప్రకటన వచ్చింది.



ఓక సెక్యూరిటీ ఆఫీసర్ మినహా, మిగతా అన్నీ సాంకేతిక/ఉన్నత విద్య ఉద్యోగాలే. ఈ ప్రకటనలో కింద ఇచ్చిన "KNOWLEDGE OF TELUGU IS ESSENTIAL FOR ALL POSTS" అన్నది గమనించవలసిన విషయం. ఈ ప్రకటన చూసి నాకు చాలా ఆనందం కలిగింది. మనమెన్ని విధాలుగా నడుంబిగించి తెలుగు కోసం ప్రయత్నాలు చేసినా, "అవసరం" ప్రజల్ని తెలుగు వైపు మరల్చినంతగా అవి ప్రభావితం చేయలేవేమో అని అనిపిస్తుంటుంది. తెలుగు తెలిసుంటే మంచిది అనో, ఇంకోటో కాకుండా, "ESSENTIAL" అని ప్రకటించిన ఆంధ్రా షుగర్స్ యాజమాన్యానికి ఓ తెలుగువాడిగా వందనం.

Saturday, September 18, 2010

తెలుగు వెలుగు ఆరనీకు - ఋషిపీఠం లో సామవేదం సంపాదకీయం

తెలుగు భాషకి ప్రాచీన హోదా కలిగించాలని మనవారు శతధా ప్రయత్నించారు. దక్కినట్టే దక్కి పక్కకి వెళ్ళింది. సృష్టికి పూర్వమే తమ భాష ఉండేది - అనగలిగిన అతివాదులైన తమిళసోదరులు, మరొక దానిని అభివృద్ధి చెందనివ్వని అసహనాన్ని, రాజకీయ ప్రాబల్యంతో సాఫల్యం చేసుకుంటున్నారు. ఈ దశలో మన తల్లి పలుకుకి తొలి ఘనతను సాధించడానికి మరిన్ని కుస్తీలు పట్టకతప్పదు.

అది అలా ఉంచి - ప్రాచీన హోదా కన్న, ప్రస్తుతం ఈ భాషను బ్రతికించే ప్రయత్నం ఎంత మాత్రం జరుతుతోంది? ఆలోచించవలసినదే. తెలుగు మాట్లాడే రాష్ట్రంలోనే ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి తెలుగుని పకలనివ్వకుండా, చదవనీయకుండా చేస్తున్న ’స్కూల్స్’ కుప్పలు తెప్పలు. పైగా తెలుగు అన్నా, రాసినా, చదివినా శిక్షించే విధానాలు కోకొల్లలు. తమ పిల్లలు తెలుగు మాట్లాడితే విలవిల్లాడిపోయే ’మమ్మీ, డాడీలు’ అసంఖ్యాకం. ఈ స్థితిలో ’ఒకనాటి భాష’ అని అనుకొనే రోజులు వస్తాయేమోనని భయం కలుగుతుంది.

ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు - కోవాలు కూడా. కానీ తెలుగును తగల బెట్టడమెందుకు? కుప్పతగలబెట్టి పేలాలు ఏరుకోవడం - అనే సామెత చందం.

అమెరికా పర్యటనలో తెలుగుతనాన్నీ, భారతీయతనీ పరిశీలిస్తూ సాగిన సందర్భంగా - మనవారి అభిమానం నన్ను అబ్బుర పరిచింది. సుదూరం వల్ల ఏర్పడినది - అనుకోవాలా? లేక విలువ తెలిసిన వివేకవంతులు - అని భావించాలా?

టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్‍లో ఒక చోట అనేక మంది పిల్లలు సుమతీ, వేమన, భాస్కర, కుమారీ శతకాలలోని పద్యాలను ధారాళంగా పుస్తకాపేక్ష లేకుండా చదివారు. వారు మామూలుగా చదివే అమెరికన్ చదువేకాక, తల్లిదండ్రుల ద్వారా వీటిని కూడా నేర్చుకుంటున్నారు. దీని బట్టి ఇంటి బాధ్యత ఏమిటో ఇక్కడి డాడీమమ్మీలు గ్రహింతురుగాక!

మరొకచోట (కాలిఫోర్నియా) సంప్రదాయపు వస్త్రధారణలో ఒక యువతి తేటతెలుగు మాట్లాడుతుంటే, "ఆంధ్రదేశంలో మీ ఊరు ఏదమ్మా?" అని అడిగాను. "నేను ఇక్కడే పుట్టి పెరిగాను. తెలుగు ఇంట్లోనే నేర్చుకున్నాను. చిన్నతనం నుండి మా ఇంట్లో అమ్మా నాన్న తెలుగు మాట్లాడడం వల్ల నాకు తెలుగు అబ్బింది" అని చెప్పిందా అమ్మాయి.

ఆమె తెలుగులో తడబాటు, అమెరికాయాస లేదు. సాధారణంగా అక్కడా ఇక్కడా కూడా ఒక భ్రాంతి వుంది. ఇంట్లో తెలుగు, స్కూల్లో ఇంగ్లీషయితే పిల్లలు అయోమయమవుతారనీ, అందుకే ఇంట్లో కూడా ఇంగ్లీషే మాట్లాడాలని - స్కూల్ అధికారులు ’పేరెంట్స్’కి శ్రీముఖాలు పంపుతుంటారు. కానీ అది తప్పుడు అభిప్రాయం.

"నా చిన్నప్పుడు మా తల్లిదండ్రులకి కూడా ఇలాంటి ’నోటీసులు’ వచ్చాయి. కానీ మా నాన్న’ఇంగ్లీష్ రాకపోయినా ఫరవాలేదు. మా అమ్మాయి ఇంట్లో తెలుగే మాట్లాడుతుంది’ అన్నారు. నేను ఇంగ్లీషు చదువుకున్నాను. ఆ భాషని అనర్గళంగా మాట్లాడగలను. తెలుగు కూడా శుభ్రంగా మాట్లాడతాను, వ్రాస్తాను’ అని చెప్పిందా తల్లి.

అందరూ కాకపోయినా, చాలామంది అమెరికాలో పుట్టిన తెలుగు యువత ఇటువంటి వారు అనేక చోట్ల కనబడ్డారు. దానికి తోడు ప్రతివారం ఆలయాల్లో తెలుగు, తమిళం వంటి భారతీయ భాషల్ని నేర్పుతున్నారు.

మన ఆలయాలు అమెరికాలో సంస్కృతి పరిరక్షణ కేంద్రాలు - అని నిర్వచించవచ్చు.

ముఖ్యంగా ’సిలికానాంధ్ర’ సంస్థవారు అమెరికాలో 15 రాష్ట్రాల్లో ’మనబడి’ పేరుతో తెలుగును నేర్పుతున్నారు. ఎందరో నేర్చుకుంటున్నారు. దీనిని నిర్వహిస్తున్న మన వారందరికీ చేతులు జోడించి నమస్కరించాలి.

ఇలాంటి ’మనబడులు’ ఇప్పుడు మన రాష్ట్రంలో నిలకొల్పాలి. విద్యావ్యాపార సంస్థలలో తెలుగు నలిగిపోతున్న ఈ సమయం లో, ప్రభుత్వాలు నిద్రపోతున్న తరుణంలో భాషని బ్రతికించే మార్గాలు యోచించాలి. ఏడాదికోసారి మాతృభాషాదినోత్సవాలు జరిపించి చేతులు దులుపుకుంటున్న క్షుద్రరాజకీయులతో నిండిపోయిన ప్రభుత్వం వల్ల భాష బ్రతకదు. వారికి చిత్తశుద్ధే ఉంటే తెలుగును ప్రధాన విషయంగా పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రవేశపెట్టేవారు. తెలుగు నేర్పేవారు కూడా "యిజాలు"గా తెలుగు
సాహిత్యాన్ని ముక్కలు చీసి విద్యార్ధుల తలల్ని విషమయం చేయకుండా జాగ్రత్తపడాలి.

అమెరికా లో రాష్త్రీయ,జాతీయ స్థాయిలలో ’స్పెల్లింగ్’ పోటీలు నిర్వహిస్తున్నారు. దీని బట్టి అంగ్లభాషా పటిష్ఠతకు వారు చేస్తున్న కృషి తెలుస్టోంది .మన రాష్త్ర ప్రభుత్వాలు , స్వచ్చంద సంస్థలు కూడా తెలుగు ఉచ్ఛారణ, పదాల శుద్ధతపై ఇటువంటి పోటీలు నిర్వహించే యోచన చేయాలి.

ప్రథమంగా ఇంట్లో తల్లిదండ్రులు వారి చిన్ననాటి పాఠ్యపుస్తకాలను గుర్తుతెచ్చుకొని పిల్లలకి నేర్పాలి. నేటి పాఠ్యపుస్తకాల్లో ’వాదాల’ జబ్బు ముదిరిన అధ్యాపకుల వల్ల తెలుగు శోభ తగ్గిపోతోంది.రకరకాల తర్కాలు చేసి తెలుగుపై విరక్తిని పుట్టిస్తున్న అచార్యుల నుండి కూడా తెలుగును కాపాడాలి.

చూస్తూ వుంటే - కొన్నాళ్ళకి ఆంధ్రం నేర్పడానికి అమెరికా నుండి ఆచార్యులు రావలసి వస్తుందేమో!

బర్కిలీ లాంటి విశ్వవిద్యాలయాల్లో తెలుగు నేర్చుకొంటున్న పాశ్చాత్యులు ఉన్నారని విని మురిసిపోయాను.అన్నమయ్య పాటలు స్తోత్రసాహిత్యం,నాట్యం... మొదలైన కళల్ని నేర్చుకోవడం వల్ల కూడా తెలుగు బతుకుతోంది. ఈ పద్ధతుల్లోనైనా పిల్లల్లో తెలుగు జీవింపచేయాలి.

నేటి విద్యావిధానం బారతీయ భాషల్ని, భారతీయతనీ ధ్వంసం చేసేందుకు సంకల్పించుకున్న విదేశీభావుకుల హస్తాల్లో ఉంది. భారతదేశంలో భారతీయతకు మనుగడ లేకుండా చేయాలనుకొంటున్న ఎడమవంక వారి కుటిలత్వం చదువుల తల్లిని బాధిస్తోంది.

ఇన్ని అవరోధాల నడుమ - ఒక మహానాగరక సంస్కార భాషని సజీవంగా ఉంచే ఉద్యమాన్ని చేపట్టాలి

- సామవేదం షణ్ముఖ శర్మ
-----------------------------------------------------------------------------------
ఋషిపీఠం ఆధ్యాత్మిక మాస పత్రికలో సామవేదం షణ్ముఖ శర్మగారి ఈ మాసం సంపాదకీయం బ్లాగరులతో పంచుకుందామని.

Sunday, August 08, 2010

సుందరి - సుబ్బారావు

సు: ఎవరితోటోయ్ మాట్లాడుతున్నావు ఫోనులో? అత్తయ్యగారితో నేనా? పైగా “ఈ మధ్య అస్సలు మాట వినట్లేదు” అనికూడా అంటున్నావు, నా గురించేనా?

సుం: విన్నారూ.... అవును మా అమ్మతోనే....... మీ గురించే మాట్లాడుతున్నాను, ఇంకెవరిగురించి మాట్లాడతాను... ఏ మాట్లాడకూడదా...

నేనలా అన్నానా? సరేలే.... ఏంటి ఇడ్లీ పిండి రుబ్బుతున్నావా? అన్నట్టు నిన్న మిక్సీ పాడయ్యింది కదా? నేను కూడా ఓ చెయ్యేసాను, అయినా అది బాగవ్వలేదు...... ఎంచేసావేమిటి?

ఆ, నేనేం చేస్తానూ... కాస్త పాతబడింది కదా, కొంచెం మొరాయిస్తోందని, గట్టిగా ఓ దెబ్బ వేసాను, మాట వినడం మొదలెట్టింది. ఇప్పుడు సరిగ్గా పనిచేస్తోంది.

Sunday, January 24, 2010

పాపం, గేదె కష్టాలు...


ఎఱ్ఱగడ్డ వంతెన దగ్గర కనిపించిందీ దృశ్యం మాకు ఇవాళ. పాపం ఆ గేదె ఎంత ఇబ్బంది పడుతూ అలా మెడ వేలాడేసుకుంటూ కూర్చుందో.....

ఇదివరకు ఒకట్రెండు సార్లు ఇలా గేదెని, దాని దూడని తీసుకెళ్లడం చూసాను. సాధారణంగా గేదెని నుంచోపెట్టి, అది కదలకుండా అన్ని వైపులా కట్టి, మెడకి ఇంకాస్త పకడ్బందీగా బంధం వేసి, బండికి కడతారు. పాపం ఈ గేదెకి కాళ్లు నెప్పట్టి కూర్చోవాలని ప్రయత్నించిందేమో. ఇలా మెడ వేళాడేసుకుంటూనే అది కూర్చుని ఎంత దూరం ప్రయాణం చేస్తొందో.....

ఫోటో క్రిడిట్స్ - మా ఆవిడ

Wednesday, January 06, 2010

కోతి కొమ్మచ్చి, ఈ మధ్యనే పాల్గొని, ఆడాను....

నండూరిగారూ నేనూ మానేసిన ఆరునెలలు తరవాత వీక్లీసేల్సు 85 వేలకి పెరిగాయి.
మేం వచ్చిన ఆర్నెల్లలో ఇరవై వేలు పెరిగింది అని కొత సంపాదకవర్గం లేని మీసాలు మెలేసి, వాటికి మైనం పూసి వాటిమీద నిమ్మకాయలు నిలబెట్టింది. యువరాజు ఔనన్నట్లు మందహాసం చేశారు.
చిన్న కో.కొ. జోకు:
హాలీవుడ్ లో ఒక జంట పెళ్ళయిన ఎనిమిది మాసాలకే విడాకులిచ్చుకుంది. ఆ పిల్ల వెంటనే ఇంకో మంచి కుర్రాడిని పెళ్ళాడింది. తొమ్మిదోనెల నిండాగానే కొడుకుని కన్నది. కొత్త మొగుడు మీసాలు మెలేశాడు.
"రికార్డు! పెళ్ళయిన ఒక్క నెలలో కొడుకుని కన్నాను!" అని. నీచోపమానం. సారీ చెరిపెయ్యండి.

రెండో రాజీనామా తరవాత సంపాదన కుళాయి ధార సన్నబడింది.

-------------------------------------------------------------------
ఇది కోతి కొమ్మచ్చి మొదటి భాగం ముగింపు, రెండో భాగానికి పలకరింపు.
బాపు - రమణల స్వీయ చరిత్ర.
రమణ రాతలు, బాపు గీతలు
ఎన్నో జోకులు, వాటికి బొమ్మల షోకులు
విషయాలు పాతవి, కాని ఎంతో కొత్తగా వినిపిస్తాయి.
మరి మొదటి భాగం అలా ముగిస్తే... మొదలవ్వడమేమో, ఇలా మొదలయ్యింది.
-------------------------------------------------------------------
గడచిపోయిన కష్టాల కథ - ఈదేసిన గోదావరి - దాటేసిన గండం - తార్రోడ్డుమీద ఎండలో జోళ్ళు లేకుండా నడిచి నీడకు చేరిన కాళ్ళు - ఈ కష్టలు అనుభివిస్తున్నప్పుడు బాధగానే వుంటుందిగాని, అవి దాటిపోయాక - వాతిని తలుచుకోవడం - వినేవాళ్ళకి అనుభవాలుగా చెప్పడం - ఆ హాయికి కొత్తావకాయ కూడా సాటిరాదు - అందుకే గతకాలము మేలు వచ్చుకాలముకంటే అన్నారు పెద్దలు...."
-------------------------------------------------------------------
రెండో భాగం (ఇం)కోతి కొమ్మచ్చి ఈ మధ్యనే విడుదలయ్యింది. మొదటి భాగం ఇప్పటికే నాలుగు ముద్రణలు ముద్రించుకుంది..... ముద్దుగా మరెన్నో ముద్రణలు ముద్రించుకుంటుంది కూడా....
మీరింకా చదవలేదా? ప్చ్, మీకు నా సానుభూతి.

Saturday, January 02, 2010

శబ్దార్థ సర్వస్వం - 3,80.000 పేజీల వ్రాత ప్రతి

ఓ వేమన పద్యం (గుణయుతునకు) కోసం గూగులమ్మని అడగ్గా అది మూడు ఫలితాలన్నిచ్చింది. వాటిలో రెండు ఫలితాలు "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంధాలయం & పరిశోధనాలయం" వారి వెబ్సైటులోవి. ఈ వెబ్సైటుని నేను మొదటి సారి చూస్తున్నాను. ఇదేదో విలువైన భాండాగారమల్లే వుందే అని దానిని చూడ్డం మొదలెట్టాను.అక్కడే కనిపించింది నాకు, "శబ్దార్ధ సర్వస్వం".

"శ్రీ పరవస్తు వెంకట రాంగాచారి గారి శబ్దార్ధ సర్వస్వం అనే సంస్కృత రచనని సర్వ సంగ్రహ నిఘంటువుగా పేర్కొనవచ్చును. ఈ రచన అన్ని విషయాల గురించి సంస్కృత భాషలో విశదపరుస్తుంది. ఈ రచన కాస్తకాస్తగా ముప్పై అయుదేళ్ల కాలావధిలో రాస్తూ పోయినప్పటికీ, ఆయన తన జీవితకాలంలో పూర్తి చేయలేకపోయారు. ఈ పుస్తకం అచ్చయి ఉండి ఉంటే సంస్కృత భాషకే తలమానికమయ్యేది, శాశ్వతంగా నిలిచేది" అని ఈ పుస్తక పరిచయంలో అక్కడ రాసారు.

బావుంది, అని ఇంకాస్త లోతుల్లోకి వెళ్లాను. అక్షరాలా మూడు లక్షల ఎనభై పేజీల వ్రాత ప్రతి !!! 1865లో ప్రారంభించి ముప్పైఐదేళ్ల పాటు కొంచెం కొంచెంగా రాస్తూ కూడా అసంపూర్ణంగా మిగిలిపోయిందిట. ఈ ఉద్గ్రంధాన్ని ఈ సంస్థ digtise చేస్తోంది. ఇప్పటికి నూటయాభై భాగాలుగా digtise చేసారు. ఈ పుస్తకం సంస్కృత పుస్తకమే అయినా, అది రాసినది తెలుగు లిపిలో. ప్రయత్నిస్తే, ఆ చేతిరాత చాలా మటుక్కు నేను (తెలుగు చేతి రాత చదివి, రాసి ఓ పుష్కర కాలమయ్యింది) కూడబలుక్కుని చదవగలుగుతున్నాను. నేను చూసిన ఓ 10-15 పేజీల వరకు, పుస్తకం కూడా బాగానే కాపాడిపడినట్టు లెక్క.

కేవలం అ, ఆ అక్షరాల వరకు దీనిని అచ్చేసారుట. దానికే 650 పేజీలయ్యాయి. ఆ అచ్చు పుస్తకంకూడా వీరి దగ్గర వుంది.





35 సంవత్సరాల్లో 3,80,000 పేజీలంటే, దాదాపు రోజుకి ముప్పై పేజీలు రాసారన్నమాట ఆ మహానుభావుడు. ఈ పుస్తకం ఎంత గొప్పదో ఊహించడానికి కూడా నాకు అర్హత లేదేమో అనిపిస్తోంది. ఈ కొత్త సంవత్సరం నేను తీసుకున్న నిర్ణయం, ఉస్మానియా విశ్వవిద్యాలంలో ఉన్న ఈ సంస్థకి వెళ్లి ఈ పుస్తకాన్ని చూసిరావాలి.

ఈ పుస్తకం మొత్తం చేతనయినంత తొందరగా వీకీ మూలం లాంటి చోటుకి చేరి, యావత్ప్రపంచానికీ వెతికేందుకు అందుబాటులోకి రావాలని ఆకాంక్ష.



ఇప్పటివరకూ digitise చేయబడిన నూటయాభై భాగాలు.