Thursday, September 21, 2006

కిన్నెరసాని - దొరసాని

విశ్వనాథ సత్యనారాయణ గారు "కిన్నెరసాని పాటలు" రాసారు।

దాని గురించి ఆసక్తికరమైన ఈ సంఘటన నేను "విశ్వనాథ ఒక కల్పవృక్షం" అనే పుస్తకంలో చదివాను।
------------------------------------------------------------
'కిన్నెరసాని' ఒక అందమైన పేరు। కాని ఒక దొరసాని గారికి ఆ పేరు చాలా వికటంగా తోచింది। గురువుగారే చెప్పారు ఈ విషయం।
"నేను కిన్నెరసాని పాటలు వ్రాసే నాటికే గొప్ప కవినని అభిమానించిన శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు నాకు సహాయం చేయించాలని ఒక నిజాం జమీందారు ఇంటికి తీసుకువెళ్ళారు। ఆ జమీందారు చనిపోయి కొద్ది కాలమైంది। ఆయన గారి భార్య వుంది। పరదా చాటున ఆమె, ఇవతల నేను। నన్ను ఆమెకు పరిచయం చేశారు। ఆమె విజ్ఞురాలని నాకు చెప్పారు। ఆమె పరదాచాటున వుండి "కవిగారూ! మీరు సంప్రదాయ బద్ధంగా రాసారన్నారు। కాని సాని పాటలు వ్రాశారేమిటి?" అన్నది
నేను ఎంత పొగరుబోతునైనా వినయం తక్కువైన వాడిని కాదు కదా! "అమ్మా కిన్నెరసాని అన్నది ఒకవాగు పేరు కదా! దాని పేరుతో దాని గురించి వ్రాయటంలో తప్పేమిటి?" అన్నాను। ఆమె ఊరుకో వచ్చు కదా! అబ్బే ఏమైనా సాని సానే అన్నది। పరదా లోపల పెదవి విరుచుకుని వుంటుంది। నేను వెంటనే "అలాగా అమ్మా! ఇందాకటి నుండి తమను తమ పరిచారకులు దొరసాని గారు దొరసాని గారు అంటే ఏమో అనుకున్నాను। ఇంక సెలవు వస్తాను" అని చెరచెరా బైటికి వచ్చేశాను।

అక్కడనే ఉన్న శ్రీ రెడ్డి గారు, దేశముఖ్ గడగడ లాడి పోతూ ఆమెకేమో చెప్పుకుని బయటకు వచ్చారు। "ఇవ్వాళ ఎంత పనిచేశావయ్యా? ఆమె నిన్ను అరెస్టు చేయవచ్చు। ఏమైనా చేయవచ్చు।" అని అన్నారు।
"ఏమయ్యేది? చంపుతుందా ? అదే నయం। యదార్ధం చెప్పడానికి భయపడటం కన్న అది నయం కదూ। శబ్దానికి అర్థం తెలియని ప్రతివాడూ విమర్శకుడైతే చచ్చేచావు కదండీ? తమ బ్రతుకే తమకు తెలియని వాళ్ళు కవుల తప్పులెన్నేవాళ్ళా? సందర్భం నుండి పదాలను విడగొట్టి కవుల తప్పులెన్నే వాళ్ళని చూస్తే నాకు ఒళ్ళు మంట" అన్నాను।
అప్పుడు రెడ్డిగారు నవ్వుతూ కారులో కూర్చొని "ఏమయితే ఏం? ఇవాళ నూటపదహార్లు పోగొట్టుకున్నా" అన్నారు।
"నా అభిమానం పోగొట్టుకోలేదు। అదే నాకు పదివేలు" అన్నాను నేను।
----------------------------------------------------------------------------
ఇంతకీ ఇదంతా ఎందుకంటే, "కిన్నెరసాని" అంటే నాకు కూడా అభిమానమే। నా బ్లాగు పేరు అదేకదా మరి ! నేను నా చిన్నతనమంతా కొత్తగూడెం లో గడిపాను। కిన్నెరసాని అక్కడికి చాలా దగ్గర। కిన్నెరసాని డాముకి రెండు మూడు సార్లు వెళ్ళాను। ఊహ తెలిసాక, సితార సినిమాలో "కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నల పైటేసి " అనే పాట నన్నాకర్షింది। కొంచెం తెలుగు సాహిత్యం గురించి తెలిసాక, విశ్వనాథ సత్యనారాయణగారు కిన్నెరసాని పాటలు రాసారని తెలిసి ఆనందించాను। నేను నా బ్లాగుకి ప్రాంతీయమైన తెలుగు పదంకోసం చూసినప్పుడు "కిన్నెరసాని" పేరే నాకు తట్టింది।

"కిన్నెరసాని పాటలు"లోని కొన్ని చరణాలు
9.
కిన్నెర వైభవం
ఋతువు ఋతువున మారు రుచులలో కిన్నెరా
కారుకారువ మారు కాంతిలో కిన్నెరా
తెలుగు సత్కవిరాజు పలుకందుకోలేని
చవులూరి చవులూరి జలమెల్ల ప్రొవులై
కదిలేను కిన్నెరా
సాగేను కిన్నెరా

తెలుగు దైవమ్ము భద్రాద్రిపై నెలకొన్న
రామయ్య అతని దర్శనము చేసే త్రోవ
కాచింది కిన్నెర
తెలుగు యాత్రికుల కందిచ్చు చల్లని నీడ
పుణ్యాత్మ కిన్నెరా
తెలుగు యాత్రికుల కందిచ్చు చల్లని నీరు
పూతాత్మ కిన్నెరా
తెలుగు దైవమ్ము భద్రాద్రిపై నెలకొన్న
రామయ్య అతని దర్శనము చేసే త్రోవ
కాచింది కిన్నెరా

7 comments:

హర్షోల్లాసం said...

చాల బాగుంది హర్ష గారు మీ కిన్నెరసాని-దొరసాని,ఇంకా మీ తూ.గో జిల్ల అభిమానం కూడాను:)

9thhouse.org said...

మీరు చెప్పిన సంగతి చాలా బాగుంది. కిన్నెరసాని పాటలంటే నాకూ చాలా ఇష్టమే. ఈ పాటలు విశ్వనాథవారి గొంతులో ‘ఈమాట’ మేగజైన్ లో శబ్దతరంగాలు శీర్షికలో వినవచ్చు.

కిన్నెరసాని పాటల్లోంచి మీరు రాసిన చరణాల్లో ‘ముద్రారాక్షసాలు’ బాధ కలిగించాయి.

http://nagamurali.wordpress.com/2007/12/30/%E0%B0%95%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%86%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B0%B2%E0%B1%81/

శ్రీ హర్ష PVSS Sri Harsha said...

మురళి గారు,
‘ముద్రారాక్షసాలు’ గురించి చెప్పినందుకు ధన్యవాదాలు
ఈ క్రింది వాక్యాన్ని సరిచేసాను. ఇది కాక వేరే ఏవైనా తప్పులు ఉంటే తెలియ పరచండి, సరిచేస్తాను
కారుకారువ మారు కంతిలో కిన్నెరా
కారుకారువ మారు కాంతిలో కిన్నెరా

Bolloju Baba said...

అవును ఎక్కడో చదివాను. విశ్వనాధ వారి స్వాభిమానం.
ఇలాంటి పెద్దాయన ఒకసారి ఖంగు తినవలసి వచ్చింది ఒక సందర్భంలో
జాషువాకు విశ్వనాధవారికి కలిపి సన్మానం జరుపుతున్నప్పుడు, జాషువాతో కలసి కూర్చుని సన్మానింపబడటం పెద్దగా ఇష్టంలేని విశ్వనాధ వారు ఇలా అన్నార్ట, " ఈ సన్మానంతో గుర్రాన్ని గాడిదను ఒక రాటను కట్టేసినట్లయింది" అని. అది విని జాషువా తన ప్రసంగంలో " అవును నిజమే ఈ సన్మానంతో గుర్రాన్ని గాడిదను ఒక రాటను కట్టేసారు " అని గొప్ప చురకంటించారట. ( జాషువా గారి ఇంటి పేరు గుర్రం మరి)

బొల్లోజు బాబా

9thhouse.org said...

హర్ష గారూ, నా మాట మన్నించి సరి చేసినందుకు ధన్యవాదాలు. ‘ఛవులూరి, చవులూరి’ అనుకుంటాను.
ఇంత మంచి టపా రాసినందుకు మీకు మరొకసారి నా ధన్యవాదాలు.

Sujata M said...

మీ ఈ పోస్టు ని సంవత్సరం క్రిందట చదివాను. మళ్ళా ప్రచురించారంటే.. నేను పొరపాటు పడ్డానా ? ఏమో ! అప్పుడు నాకు కామెంటు రాయటం తెలియలేదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి రాస్తున్నాను. మీ బ్లాగు చాల బావుంది.

Unknown said...

bagundi