Friday, July 22, 2005

హైదరాబాదు ట్రాఫిక్కు చిక్కులు

కుడి ఎడమయితే పొరపాటు లేదోయ్
ఇది మన హైదరబాదేనోయ్
గడి గడికో అడ్డుతగులునోయ్
అయినా, వడి వడిగా దూరిపోతారోయ్

నాలుగొందల సంవత్సరాల
ఘన చరిత్ర ఉన్న భాగ్యనగరం
కానీ, రెండే గంటల వాన
తుడిచిపెట్టింది దీని సౌభాగ్యం
వాన వెలిసింది, అసలు తెలిసింది
మారింది ఇది దౌర్భాగ్యనగరం
నడిరోడ్డున ట్రాఫిక్కు నిలిచిపోయి
అయ్యారు అందరూ నిర్భాగ్యులు
నేనూ ఉన్నాను ఆ "జాము"లో
ఆహా!! ఏమి నా భాగ్యం

ఇంతలో, ఇదంతా టీవీ చానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం
ఆతృతతో ఇంటినుంచి ఫోనులో వాకబు చేయడం
మాట్లాడి, అందించాను నా క్షేమ సమాచారం
కానీ అనుకున్న దానికన్నా ముదిరింది వ్యవహారం

నీరు పారి దారులు అయ్యాయి ఏరులు
ఆగిపోయి బారులు తీరాయి బస్సులు, కారులు
నిజమయ్యాయి ట్రాఫిక్కు జాముపై విన్న పుకారులు
అయినా, చక్కబెట్టడానికి ఒక్కరూ లేరు అధికారులు।

ఇంత అసౌకర్యం జన్మానికో శివరాత్రి అంటే తప్పు!! తప్పు!!!
నగరంలో ఏ రోజు లెదు ట్రాఫిక్కు ఇబ్బంది చెప్పు!! చెప్పు!!!

చిక్కడపల్లి ట్రాఫిక్కులో చిక్కి
ఎరక్కపోయి ఇరుక్కున్నాననుకున్నాను
కానీ, ఎరుక ఉన్నా ఇరుకు సందులైతే
ఇరుక్కోక తప్పదని తెలుసుకున్నాను

ఇక నాలుగు రోడ్ల కూడాళ్ల జాములో
విజృంభిస్తుంది నాలుగు పడగల ట్రాఫిక్కు నాగరాజు
సహస్ర నాసికా గొట్టాల నుండి విషవాయువులు పంపించి
వాతావరణ కాలుష్యం పెంచి
మన ఆయుష్షు తగ్గించి
మనకు శోష తెప్పించినంత పని చేస్తుంది

కాదే రోడ్డూ ఆర్టీసీకి అనర్హం
ముఖ్య రహదారయినా, కాలనీ రాడ్డయినా
అన్నిటా బస్సులు ప్రత్యక్షం,
నగరం రోడ్లపై వాటి స్వైర విహారం।
పాపం, ఎంతో మందికి
గమ్యం చేరుటకు అవే ముఖ్య ఆధారం
అయితే, అప్పుడప్పుడు
part time లో యమదూతలకు సహకారం

ఆటోవాలా,
ఈ నైజాము రాచనగరు రోడ్లకి నజరానాలేని నవాబు
అడ్డదిడ్దంగా నడుపుటయే అతనికి పెద్ద కితాబు
ఎంత విర్రవీగి ఎలా నడిపినా చెల్లును అతని రుబాబు
ఆటోల వెంబడి బండి నడిపితే, మనఃశాంతి పూర్తిగా ఖరాబు

ఈ గందరగోళంలో మన పాత్ర కూడా ఎంతోకొంత
అందుకే, గుర్తుంచుకొని ట్రాఫిక్ నియమాలు పాటించాలి మనమంతా
ముందుగా నేను అలవరుచుకుని, నిబంధనలు పాటిస్తాను చేతనయినంత

4 comments:

Dinakar said...

కకాకికీకుకూకెకేకైకంకః क कि गीतव

Dinakar said...

తెలుగు లొ చాల బగుంది
ఇట్ల
దినకర్

tankman said...

చిక్కడపల్లి ట్రాఫిక్కులో చిక్కి
ఎరక్కపోయి ఇరుక్కున్నాననుకున్నాను
కానీ, ఎరుక ఉన్నా ఇరుకు సందులైతే
ఇరుక్కోక తప్పదని తెలుసుకున్నాను

ఇది మాత్రం అద్భుతం , అమోఘం , అద్వితీయం మరియు నిజం

చదువరి said...

మన పాత్ర తక్కువేమీ కాదు, మీరన్నట్టు. హై. లో ట్రాఫిక్ క్రమ శిక్షణ తక్కువ కావడం ఈ జాములకో ముఖ్య కారణం.