Sunday, November 02, 2008

అటో, ఇటో, ఎటో.... బెంగుళూరు ఆటో

ఇప్పటికే చాలా, చాలా మంది బెంగుళూరు ఆటోల గురించి బ్లాగారు.... చర్చించారు, విశ్లేషించారు, వెరచారు, అరిచారు, గిరిచారు... , మరిచారు... అయినా నేను మళ్ళీ బ్లాగుదామని నిర్ణయించాను, ఎందుకుట?

ఇదిగో, ఇలాంటి ప్రశ్నే రామ కథ రాసుకుంటున్న విశ్వనాథ గారిని "మరలనిదేల రామాయణంబన్న" అని వేస్తే, "నా భక్తి భావనలు నావి గాన" అని చెప్పుకున్నారట.

ఎవో నా ఆటో అనుభవాలు నావి కాబట్టి.....

ఎంనాయనా, రామకథకీ నీ ఆటోకథ కి పోలికా? అంత చులకనయిపోయాడా రాముడంటే, రామాయణమంటే నీకు? నువ్వేమన్నా కరుణానిధివనుకుంటున్నావా, ఇష్టమొచ్చినట్టు రాముడికి, రామకథకి పోలికలు తీసుకురావడానికి? అని అంటారా.....

అయ్యా, ఎంత మాట!!! రామాయణం కూడా ప్రయాణం గురించేనని పెద్దలు చెప్పగా విన్నాను. నేను రాసేది కూడా ఆటో ప్రయాణం గురించే నండి. అంతే నండి....

*********

ఆలస్యంగా నడుస్తున్న యశ్వంతపూర్ బండిలో వస్తున్న భార్యని రిసీవ్ చేసుకోవడానికి HSR Layout నుంచి బయల్దేరిన నాకు, "రైలు దొడ్డబళ్ళాపూర్ వచ్చిందని" SMS వచ్చింది. బస్సా, ఆటోనా అని తర్జన భర్జన పడి తాత్సారం చేస్తూ ఒక నిర్ణయానికి వచ్చేలోగా "ఎలహంక" అని SMS వచ్చేసింది. ఇక ఆలోచనలు ఆపేసి నిర్ణయం తీసేసుకోవాల్సి వచ్చింది.

"యశ్వంతపూర్ కి వస్తావా?"
"రెండొందలాభై అవుతుంది..."
"?*&^#~@$!*$&^#...."
"నాకు తెలుసు సార్, హైదరాబాద్ నుంచి యశ్వంతపూర్ కి రైలు టిక్కెట్టు 275రూ, ఇక్కడినుంచి యశ్వంతపూర్ కి రెండొందలాభై ఏంటి? అదే కదా సార్ ఆ ఫేస్ లో ఫీలింగ్? రెండొందలాభై ఏమీ జాస్తి కాదు సార్. అంత కన్నా తక్కువయితే వచ్చే లేదు."
ఇక నాకు మీటర్ మాటెత్తే ఛాన్సే ఇవ్వలేదు....
"ఇంకా నయం, రెండొందలాభై రూపాయల నెల జీతంతో తన సంపాదన మొదలుపెట్టిన మా నాన్నగారితో అనలేదు ఆటోడ్రైవరు ఈ మాట, అనుంటేనా....."

ఇంకో SMS వచ్చేలోగా, ఆటోలో ఎక్కి కూర్చుని 45 నిమిషాలలో ఉంటాను అని SMS పంపాను. ఆటో బయల్దేరింది.

అప్పుడు తీసుకున్నాను నేను ఒక ప్రతిఙ్ఞ: ఇంకో సారి బెంగుళూరులో ఆటో ఎక్కితే, మీటరు మీద వస్తేనే ఆటో ఎక్కుతాను అని.

------------------------
కొన్ని రోజుల తరువాత....

ఆటో ఎక్కాల్సిన అవసరం రావడంతో, నా ప్రతిఙ్ఞ ఒకసారి గుర్తుచేసుకుని ఔటర్ రింగు రోడ్డుమీద ఆటోలకోసం చూస్తున్నాను.
కొంచెం సేపు చూసాక ఒక ఆటో వచ్చింది.
"బసవన్....." పూర్తిగా చెప్పనుకూడా లేదు దాటి ముందుకెళ్ళిపోయాడు
ఇంకొంచెం సేపు చూసాక మరో ఆటో....
"బసవన్గుడి." ఈసారి పూర్తిగా చెప్పేదాక ఉండి, దాటేసింది ఆటో.
అసహనం పెరిగింది.... మరో ఆటో వచ్చింది. రోడ్డు మధ్యలోకెళ్ళి రెండు చేతులూ అడ్డుపెట్టి, బలవంతంగా బండి ఆపి పక్కకి లాక్కొచ్చే బెంగుళూరు ట్రాఫిక్ పోలీసులా, ఆటోని ఆపి పక్కకి పట్టుకొచ్చాను. "బసవన్గుడి కి వస్తావా?" అన్నాను. రెండు నిమిషాలు ఆలోచించి, నా మీద దయతలిచి, వస్తాను అన్నాడు. హమ్మయ్య.
కాని... వెంటనే ప్రతిఙ్ఞ, ప్రతిఙ్ఞ అని నా అంతరాత్మ ఘోషించింది.
"మీటర్, మీటర్...." అని మీటర్ వైపు చుపించాను.
"ఇల్ల సార్, అక్కడ నుంచి రిటర్న్ ఎవరు దొరకరు.... నూటాభై ఇచ్చేయండి...."
నాకు కోపం వచ్చింది.
వెంటనే మళ్ళీ ప్రతిఙ్ఞ గుర్తొచ్చింది.
కాని ఇప్పటికే వచ్చి అరగంటయ్యిందని వాచి చూపించింది.
అయినా సరే, "మీటర్ మీదయితేనే ...." అని గట్టిగా చెప్పాను.
సరేనన్నట్టు తల ఊపి మీటర్ పైకి చెయ్యివేస్తున్నాడు. నా ప్రతిఙ్ఞ నెరవేరబోతోందన్న ఆనందంలో గాల్లో రెండడుగులు పైకి లేచినట్టనిపించి.... లోపలికి ఎక్కుతున్నాను, "మీటర్ మీద యాభై ఎక్కువ ఇవ్వాలి" అని చెప్పి మీటర్ తిప్పాడు. ఒక్కసారి కిందపడ్డాను గాల్లోంచి. దిగి ఇంకో ఆటో చూసుకునే సహనం, పట్టుదల, సమయం నాకు లేవు. పైగా సందర్భం కూడా లేదు. ఎందుకంటే, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, ఆకాశం మేఘావృతమయ్యింది, చెదరు మదురుగా గాలులు వీస్తున్నాయి, అక్కడక్కడ చినుకులు పడుతున్నాయి, అది ఓ మోస్తారు నుంచి భారీ వర్షంగా మారే అవకాశం ఉంది కాబట్టి. ఇక్కడ మనమో మాట చెప్పుకోవాలి. భారతదేశంలో బాంబులెప్పుడు పేలతాయో, సెన్సెక్స్ ఎప్పుడు పతనమవుతుందో, ఆడవాళ్లకి షాపింగ్ కి వెళ్ళాలని ఎప్పుడనిపిస్తుందో, బెంగుళూరులో ఎప్పుడు వర్షం పడుతుందో మనం ముందుగా చెప్పలేము.
"యాభై ఎక్కువెందుకు? చాలా జాస్తి. పదిహేను ఎక్కువ తీసుకో"
"ఇల్ల సార్, ముప్పై ఐదు"....
"సర్లే, ఇరవై ఐదు ఎక్కువిస్తాను. ఇక పోనీ"

చేసేది లేక, నా ప్రతిఙ్ఞని పొడిగించాను: ఇంకో సారి బెంగుళూరులో ఆటో ఎక్కితే, మీటరు మీదయితేనే ఆటో ఎక్కుతాను + మీటర్ మీద ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను అని.

---------------------------------------------------
మళ్ళీ కొన్ని రోజులు తరువాత.....

మార్తహళ్ళి వెళ్లాలి. ఈసారి ఎట్టి పరిస్థితులలోనైనా సరే, ఆటోవాడిది పైచేయి కాకూడదు అని పొడిగించిన నా ప్రతిఙ్ఞ మననం చేసుకుని ఆటోల దగ్గరికి వెళ్లాను.
మొదటి ఆటో.. "మార్తహళ్ళి వస్తావా?" X
రెండవ "మార్తహళ్ళి ...?" X
మూడవ
"మార్తహళ్ళి....?"
"వస్తాను.. నూరు ఇవ్వండి"
"వందెందుకు? అంతవ్వదు. అయినా మీటర్, మీటర్...."
"ఇల్ల..."
నాలుగవ
"మార్తహళ్ళి...?"
"వస్తాను..."
"మీటర్ మీదయితేనే..."
"మీటర్ మీద ముప్పై ఎక్కువివ్వాలి.."
"ఇల్ల..."
ఎలాగయినా సరే ఈ సారి నా ప్రతిఙ్ఞ నెరవేర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నాను....

ఐదవ
"మార్తహళ్ళి...."
"వస్తాను..."
"మీటర్ మీదయితేనే...."
"సరే సార్.... ఎక్కండి"
రెండడుగులు గాల్లో
"మీటర్ ఎంతయితే అంతే, ఎక్కువ ఇవ్వను...."
"ఒకే సార్, ముందు గాల్లోంచి కిందకి రండి"
ఇంకో రెండడుగులు గాల్లో పైకెగిరి, ఆటోలో కూర్చున్నాను.
మీటర్ తిప్పాడు, అప్పుడు చూసాను... మినిమమ్ 12 ఉంది.
"అదేంటి.... 12 ఉంది?"
"కొంచెం పాత మీటర్.... కన్వర్శన్ ఛార్ట్ ఉంది నా దగ్గర....."
ఎక్కడో మనసు కీడు శంకించింది.... అంతలో మార్తహళ్లిలో చేయవలసిన పని గుర్తొచ్చి, "తొందరగా వెళ్లాలి, బేగ బేగ..." అని చెప్పి పని గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. ఓ పదినిమిషాలు అయ్యాకా చూసేసరికి మీటర్ 55.50 చూపిస్తోంది... అప్పుడే అంత దూరం వచ్చామా అని బయటికి చూస్తే, తెలిసిన దారిలా లేదు.
"ఏ రూట్లో వెళ్తున్నాము..."
"ఇది షార్ట్ కట్ సార్"
"అదేంటి అప్పుడే యాభై దాటింది మీటర్..."
"ట్రాఫిక్ లేని రూట్ కదా, అందుకే ఫాస్టుగా వెళ్తున్నాం..."
"అయినా నీ మీటర్ తప్పు అంత ఎక్కువ అవ్వదు"
"వన్ వేస్ కదా, కొంచెం లాంగ్ అవుతుంది"
"ఇందాకేకద, షార్ట్ కట్ అన్నావు????...."
"ఈ రూట్ లో సిగ్నల్స్ , ట్రాఫిక్ అస్సలు ఉండదు... మీరే కదా బేగ అన్నారు..."
ఇంతలో మార్తహళ్ళి వచ్చింది. మీటర్ 83 చూపించింది.
కొత్త మీటర్ ప్రకారం, 96.50. మొత్తం ప్రయాణం చేసింది గట్టిగా పదిహేను నిమిషాలు కూడా లేదు.
"ఇంత ఎక్కువ అవ్వదు.... నీ మీటర్ తప్పు"
"మీటర్ అన్నారు. మీటర్ డబ్బులు ఇవ్వాలి.. బేగ అంటేనే కదా ఈ రూట్ లో వచ్చింది...."
ఉడికిపోతూ, వంద కాయితం ఇచ్చాను... జేబులో చేతులు పెట్టి, చిల్లర లేదు అని, ఐదువందల రూపాయల కాయితం చూపించాడు !!! పుండు మీద కారం చల్లినట్టుగా

నా ప్రతిఙ్ఞ మళ్ళీ పొడిగించాను: ఇంకో సారి బెంగుళూరులో ఆటో ఎక్కితే, మీటరు మీదయితేనే ఆటో ఎక్కుతాను + మీటర్ మీద ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను + కొత్త డిజిటల్ మీటర్ అయితేనే ఎక్కుతాను + చిల్లర ఉందా అని అడుగుతాను అని.
-------------------------------------------------------
ఇంకొన్ని రోజుల తరువాత...

మొదటిసారి బెంగుళూరు వస్తున్న బంధువుల్ని రిసీవ్ చేసుకోడానికి సతీసమేతంగా యశ్వంతపూర్ రైల్వేస్టేషన్ కి వెళ్లాను. ఇద్దరు చిన్నపిల్లలతో రాత్రంతా గరీబ్ రథంలో ఏసి కుర్చీలలో కూర్చోలేక, పడుకోలేక ఇబ్బంది పడివచ్చిన చుట్టాలని HSR Layout కి తీసుకెళ్ళాలి. సామాన్లు తీసుకుని బయటికి వస్తూనే ఆటోవాళ్లు వెంట పడడం మొదలెట్టారు. చాలా చొరవగా "ఎల్లి హోగ బేకు" అని పై పైకి వస్తున్న ఒకరిద్దరి ఆటో వాళ్లకి సమాధానం చెప్పబోతున్న చుట్టాన్ని వారించి గేటు బయటికి ఆటోవాళ్లని తప్పించి తీసుకొచ్చాను వాళ్లని. అప్పుటికే వాళ్లకి, మా ఆవిడకి కొంత అసహనం కలగటం మొదలయ్యింది. బయటికొచ్చాక పక్కగా ఉన్న ఒక ఆటో దగ్గర నుంచి ఆటో అతను మా దగ్గరికి వచ్చాడు. నెమ్మదిగా అతనే, "ఎల్లి హోగబేకు సార్" మాట కాస్త మెత్తగా, గౌరవంగానే ఉంది. సరే, ప్రయత్నిద్దామనిపించింది. పొడిగించిన నా ప్రతిఙ్ఞని ఓసారి మననం చేసుకున్నాను. మా ఆవిడ నావైపు తొందరపెడుతున్నట్టుగా చూసింది. నా ప్రతిఙ్ఞ కాని వినపడలేదు కదా?
"HSR Layout కి వెళ్లాలి."
"సరే సార్, వెళ్దాము. రండి" అని లగేజి ఎత్తబోయాడు.
"మీటర్ మీదయితేనే"
"సరి, పోదామా"
"మీటర్ మీద ఎక్కువేమి ఇవ్వను, మీటర్ ఎంతయితే అంతే"
"ఓకె, మీటర్ ఎంతయితే అంతే, పోదామా" అని లగేజితో ఆటోవైపు వెళ్తున్న అతని వెంట చుట్టాలు కూడా అడుగులు వేసారు
"ఆగాగు, మీటర్ కొత్త డిజిటల్ మీటరేనా?....." మా ఆవిడ నావైపు అదోలా చూసింది, నాకు కనబడలేదనుకోండి...
"డిజిటల్ మీటరే సార్, మినిమమ్ పధ్నాలుగు...."
"సరే పద" కొంచెం ఊరట కలిగింది. రెండడుగులు గాల్లో లేద్దును గాని, అసలే బెంగుళురుకి కొత్తగా వచ్చిన చుట్టాలున్నారు కదాని మానుకున్నాను. సామాన్లు ఆటోలో సర్దుతుండగా ప్రతిఙ్ఞలో ఎదో మిగిలిపోయిందని తట్టింది. ఆ గుర్తొచ్చింది.
"ఇదిగో, చిల్లరుందా? " అని గట్టిగా అడిగాను. అతను ఎదోచెప్పేలోగా, "పర్వాలేదు, నా దగ్గరుంది లే" అని మా చుట్టం అందుకోబోయారు. అయినా, నేను ఊరుకోకుండా, "అది కాదండి, వీళ్లతో అన్నీ మాట్లాడకపోతే, అక్కడికి వెళ్లాకా, ఎదో కబుర్లు చెప్పి ఎక్కువ గుంజుతారు..."
"చిల్లరుందా, లేదా?"
"ఉంది సార్, ఇక పోదామా"
"ఆ, సరే... మేము కూడా బండి మీద వెనకే వస్తాము. మమ్మల్ని మిస్సవ్వద్దు" అని చెప్పి, మోటరుసైకిలు తీసుకొచ్చి, నేను మాఆవిడ అదెక్కి.... పద అన్నాను.
"అమ్మయ్య, పర్వాలేదు నా ప్రతిఙ్ఞ ...." అని అనుకుంటున్నాను ఆటో స్టార్ట్ చేసాడు. అదేదో సైలెంసర్ పాడైన బండి అరిచినట్టుగా శబ్దం వస్తే దిక్కులు చూసాను. తీరా ఆ శబ్దం ఈ ఆటోలోంచే అని తెలిసి, "ఏంటి, సైలెంసర్ లేదా?"
"ఉంది, బావుంది కూడా"
"మరి ఆ సౌండేంటి"
"ఈ బండి బీట్ అంతే" అని గేర్ మార్చి డడ్ డడ్ డడ్ డడ్ అంటూ బయల్దేరాడు. అంతే, ఒక్కసారి తెల్లని పొగ మా ముఖాలని కప్పేసింది. కొన్ని క్షణాలు ఏమీ కనిపించలేదు. తేరుకునే సరికి, అల్లంత దూరాన ఆటో, రోడ్డు మీద దూసుకెళ్తున్న జెట్ విమానంలాగా రణగొణ ధ్వని చేస్తూ, దట్టమైన తెల్లని పొగని వెన్నక్కి వెళగక్కుతూ సాగుతోంది. చేసేదిలేక, ఆ ఆటోని వెంబడించడం మొదలెట్టాను. రోడ్డు మీద వెళ్తున్న ప్రతి బండి, ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఆ ఆటోని దాటుతూ, వెనక్కి తిరిగి ఆ ఆటోని శాపనార్థాలు పెడుతూ, దాని వెంట తోకలా వస్తున్న మావైపు జాలిగా ఓ చూపు పడేస్తున్నారు. ఇరవై కిలోమీటర్లు ఆ ఆటో వెంటే అంటి పెట్టుకుని వచ్చేసరికి, నవరంధ్రాల్లోను పొగకూరుకుపోయి ఆ శబ్దానికి రోమాలన్నీ నిక్కబొడుచుకున్నాయి. ఎట్టకేలకు మా గమ్యాన్ని చేరుకున్నాము.
"ఏంటయ్యా అంత సౌండు"
"గాస్ బండి కదా సార్, అందుకే కొంచెం సౌండు ఉంటుంది"
"మరా పొగేంటి? గాస్ బండికి పొగ ఎక్కువరాకూడదు కదా?"
"కొత్త ఇంజన్ సార్. కొత్త ఇంజన్ కి పొగ వస్తేనే మంచిది."
మీటర్ 185 అయ్యింది. రెండెందలు తీసిచ్చాను. చిల్లర కోసం చూస్తున్న నన్ను చూసి, ఆటో అతను ఓ వెకిలి నవ్వు నవ్వి, "ఇంత లోపలికి వచ్చాను, పైగా కరెక్ట్ మీటర్ కదా సార్"
నాకు అరికాలు మంట నెత్తికెక్కింది. "ఇరవై కిలోమీటర్లు నరకంలో ప్రయాణంచేయించి, మళ్ళీ ఎక్కువ డబ్బులు అడుగుతావా? అసలు నీ ఆటో ఎంత పొల్లూషన్ చేస్తొందో తెలుసా? అసలా సౌండేంటి?"
"పదిహేను రూపాయలికేంటి ఇంత లెక్చర్ ఇస్తున్నారు? ఉంచుకోండి" అని చులకనగా పదిహేను రూపాయలు నా మొహాన కొట్టి, ఆటో స్టార్ట్ చేసి, నా మొహాన పొగ వదిలి వెళ్ళి పోయాడు.

నా ప్రతిఙ్ఞ పొడిగించాల్సొచ్చింది: ఇంకో సారి బెంగుళూరులో ఆటో ఎక్కితే, మీటరు మీదయితేనే ఆటో ఎక్కుతాను + మీటర్ మీద ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వను + కొత్త డిజిటల్ మీటర్ అయితేనే ఎక్కుతాను + చిల్లర ఉందా అని అడుగుతాను + జెట్ విమానంలా పొగ కక్కి, శబ్దం చేసే ఆటో ఎక్కను

------------------------------------------------
కాల చక్రం గిర్రున తిరిగింది. ఆటో ఎక్కాల్సిన తరుణం రానే వచ్చింది.

పొడిగించిన నా ప్రతిఙ్ఞ మరిచిపోకుండా వల్లెవేసుకుంటున్నాను, రోడ్డు మీద ఆటో కోసం ఎదురుచూస్తూ. నా ముందుకే వచ్చి ఓ ఆటో ఆగింది. ఆహా, శుభసూచకం.
"మెజస్టిక్ వస్తావా?"
"వస్తాను, ఎక్కండి"
"మీటర్ మీదే"
"సరి సార్, ఎక్కండి"
"మీటర్ ఎంతయితే అంతే, అస్సలు ఎక్కువివ్వను"
"ఓకె, మీటర్ కన్నా అస్సలు ఎక్కువ వద్దు."
ఆనందంలొ రెండడుగులు గాల్లోకి లేచాను. అయినా కర్తవ్యం గుర్తుచేసుకున్నాను. ఆటో లోపలికి ఒంటెలాగా మెడ పెట్టి మీటర్ చూసాను. కొత్త డిజిటల్ మీటర్, మినిమమ్ 14 చూపిస్తోంది. నాలో ఉత్సాహం ఎక్కువవుతోంది. "చిల్లరుందా? "
"ఉంది, ఎక్కండి సార్, వెళ్దాము."
"సరే, ఆటో స్టార్ట్ చెయ్"
"ఇందాకటి నుంచి ఆటో స్టార్ట్ చెసే ఉంది"
"అవును నిజమే, ఆటో స్టార్ట్ చేసే వుంది. పొగ లేదు, శభ్దం లేదు" ఇక నా ఆనందం వర్ణనాతీతం. ఒక్కసారి ఆ ఆటో అతని ముఖారవిందాన్ని దర్శించి ఆటో ఎక్కుదామనుకున్నాను. అతను ఆటో దిగి వెన్నక్కి తిరిగి, పైన వేసుకున్న ఖాకి చొక్కాని రెండు చేతులతో స్టైల్ గా, అరె రజనీకాంత్ లాగా ఆడిస్తూ నా వైపు తిరిగాడు. రజనీకాంత్ లా ఏమీటి, రజనీకాంతే..... ఇదేంటి, రజనీకాంత్ బెంగుళూరులో.... అయినా ఎప్పుడో కదా.... అది కూడా బస్ కండక్టరుగా కదా..... మరిప్పుడు... సరేలే, అవన్నీ నాకెందుకు, ముందు నా ప్రతిఙ్ఞ నెరవేరాలి. ఇవాళ నన్నెవరూ అడ్డుకోలేరు... అని వంగి, హడావుడిగా ఆటోలోకి దూరబోతున్నాను. కాని దూరలేకపోతున్నాను. వెనకనుంచి నా చొక్కా ఎవరో లాగుతున్నటనిపించింది. "ఇవాళ నన్నాపద్దు. నేను ఆటోలో వెళ్ళాలి. నేను ఆటో ఎక్కాలి" అని ఇంకా గట్టిగా ప్రయత్నించాను. మరింత గట్టిగా నన్నెవరో వెన్నక్కి లాగుతున్నట్టనిపించింది. ఎదో గొంతు కూడా వినిపించడం మొదలయ్యింది. పరిచయమున్న గొంతే.....
"లేవండి. మిమ్మల్నే... ఆ మొద్దు నిద్దరేమిటీ?"
ఇప్పుడు చాలా స్పష్టంగా వినపడింది గొంతు....
మా ఆవిడ నన్ను ఊపుతూ, "లేచారా? పొద్దుపోయేదాకా నిద్దరోతే ఇదిగో ఇలాంటి పనికిరాని కలలే వస్తాయి. అయినా నిద్రలో ఆటో ఆటో అని ఆ కలవరింతలేమిటీ?"
నిద్ర మత్తు కొద్ది కొద్దిగా వదులుతోంది.
"ఇవాళసలే వీకెండ్ కూడాను. శనాదివారాల్లోనైనా తొందరగా లేవకపోతే ఎలా? లేవండి, లేవండి. అందులోనూ ఇవాళ మనం జయనగర్ కి షాపింగ్ కి వెళ్ళాలి. పైగా బండి కూడా లేదు. సర్వీసింగ్ కని ఇచ్చారు. ఆటోలో పడి వెళ్ళాలి. లేవండి."
నిద్ర మత్తు పూర్తిగా వదిలేసింది.

నెరవేరిందనుకున్న నా ప్రతిఙ్ఞ కలగా, కల్లగానే మిగిలిపోయింది ....