నేను మా ఊరుకి దగ్గరగానే ఉద్యోగం చేస్తుంటాను కాబట్టి తరచూ ఇంటికి వెళ్తుంటాను. ఇలా ఇంటికి రైలులో వెళ్ళేటప్పుదు సాధారణ (general)తరగతిలో ప్రయాణం. సొంత సంపాదన వచ్చాక రైలు ఎక్కిన ప్రతిసారీ ఒక మినరల్ వాటర్ బాటిల్, బిస్కట్లు కొనుక్కొని బండి ఎక్కడం పరిపాటి. బండి పైనుంచి వస్తుంది కాబట్టి ప్రయాణికులు బాగానే ఉంటారు. ఇక దారిలో ఆగిన ప్రతి స్టేషనులో ఇంకొంతమంది ఎక్కుతారు. వెరసి, సాధారణంగా రైలు ప్రయాణీకులతో కిటకిటలాడుతూ ఉంటుంది.
వేసవి కాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఒక ప్రయాణంలో, నేను మంచినీళ్ళు తాగటం చూసి, "దాహమేస్తొంది కొంచెం మంచినీళ్ళు ఇవ్వు బాబు" అని ఒక ముసలావిడ అడిగింది. మనసు వెంటనే మొహమాటపడింది. కొంచెం అయిష్టంగానే ఆ ముసలావిడకి బాటిలిచ్చాను. ఆవిడ తాగిన్నని తాగి, ఒళ్ళో ఉన్న మనడికి కొన్ని పోసి, కొన్నే నీళ్ళు మిగిలిన బాటిల్ నాకిచ్చింది. ఆవిడ తాగడమే కాకుండా, మనవడికి కూడా పట్టించి, కొన్ని నీళ్ళు మాత్రమే మిగిల్చి ఇవ్వడం నా మనసులో ఉన్న ఆ చెప్పలేని అసహన భావాన్ని ఇంకొంచం పెంచింది. సరె, కాసేపటికి ఏదో పుస్తకం చదవటంలో పడి గమ్యం చేరడం, తరువాత రోజు ఉద్యోగానికి వెళ్ళడం - షరా మామూలు జీవితం.
ఇవాళ ఇంటిలో plumber పని చేయడానికి ఇద్దరు వచ్చారు. పని చేస్తూ మధ్యలో ఒకతను "కొన్ని మంచి నీళ్ళు కావాలి" అని అడిగాడు. "తప్పకుండా" అని ఇద్దరికీ మంచినీళ్ళు తెద్దామని వంటింటికి వెళ్ళాను. చెంబు తీసాక, ఏంటో, "తప్పకుండా" అని అన్నప్పటి నాకు, చెంబునింపుతన్న నాకు, అర్థంకాని తేడా తోచింది. వాళ్ళకి రెండు గ్లాసులిచ్చి చెంబుతో నీళ్ళు పోసి "చాల"న్నాక మళ్ళి వంటింటికి వెళ్ళాను. అప్పుడు మెల్ల, మెల్లగా నా మనసులోని ఆ తేడాకి కారణం అర్థమయ్యింది. రెండు వారాల క్రితం వరకూ ఇంటిలో మామూలు మంచినీళ్ళు ఉండేవి. మొన్నీమధ్యనుంచే, మినెరల్ వాటర్ తెప్పిస్తున్నాము. డబ్బు పెట్టి కొన్న మంచినీళ్ళు అయ్యేసరికి, ఉత్తపుణ్యాన ఇవ్వడమంటె నా మనసుకి కష్టం తోచింది. అప్పుడు అర్థమయ్యింది ఆ రోజు రైలులో ముసలావిడకి మంచినీళ్ళు ఇవ్వడానికి నేను పడ్డ మొహమాటానికి అసలు కారణం.
ఆహా, ఎంత మార్పు. చిన్నప్పుడు రైలోలో ఢిల్లీ వెళ్తున్నప్పుడు, పక్క వాళ్ళు ఎవరు నీళ్ళు అడిగినా దాహం తీర్చడనికి ముందుండే మ పెద్దమ్మని చూసి, ఆ గుణం అలవర్చుకుని సంతృప్తి చెందే మనసుని, ఇంట్లో పనిచేసేవాళ్ళకి దాహమేస్తే, వారికి "చాలండి" అనే వరకు మంచినీళ్ళు పోసి ఆనందపడే మనసుని, "మంచినీళ్ళు కొనడం" అనే నిన్న మొన్నటి అలవాటు ఎంత మార్చేసింది? చేరకూడని చోట్లకి కూడా డబ్బు చేరి, "నేను డబ్బు మనిషిని కాదు" అని అనుకొనే నా మనసులోకి చేపకింద నీరులా చేరి ఇంతా మైకం కప్పుతుందని అనుకోలెదు !!!!
బ్రహ్మం గారి కాలఙ్ఞానంలో "పాలు, నీళ్ళు అమ్ముకుంటారు" అని చెప్పారని విన్నాను. చాల్లె చోద్యం, "పాలు" అమ్ముకోకుండా, free గా పంచుతారా ఏమిటి అనుకునేవాడిని. నేడు సాటి మనిషికి మంచినీళ్ళిచ్చి దాహం తీర్చడానికి కూడ ఈ అమ్ముకోవడం అడ్డుపడుతోందంటె, ఒకప్పుడు, పాలని కూడ అమ్ముకోకుండ ఉన్న స్థాయి ఎక్కడ, నేటి స్థాయి ఎక్కడ.
ఇంత ఆలోచించాక కూడా, నా తార్కిక మనసుకి ఒచ్చే వాదనలు ఇలా ఉన్నాయి.
"ఏం, ఏదో నేను చెడ్డవాడిని అయిపోయినట్లు విమర్శిస్తావేం? పాతిక రూపయలు పెట్టి, పెప్సి బాటిల్ కొన్నావనుకో, రైలులో పక్కవాడు "కాస్త తాగిస్తాను" అంటే, "తప్పకుండా. ఇదిగో తీసుకోండి" అని ఇస్తావా? ఇదీ అంతే కదా?"
నేను మాత్రం దానిని అంగీకరించలేకపోతున్నాను. అలాగని, మనుసుని తార్కికంగా ఖండించలేకపోతున్నాను......