Saturday, September 18, 2010

తెలుగు వెలుగు ఆరనీకు - ఋషిపీఠం లో సామవేదం సంపాదకీయం

తెలుగు భాషకి ప్రాచీన హోదా కలిగించాలని మనవారు శతధా ప్రయత్నించారు. దక్కినట్టే దక్కి పక్కకి వెళ్ళింది. సృష్టికి పూర్వమే తమ భాష ఉండేది - అనగలిగిన అతివాదులైన తమిళసోదరులు, మరొక దానిని అభివృద్ధి చెందనివ్వని అసహనాన్ని, రాజకీయ ప్రాబల్యంతో సాఫల్యం చేసుకుంటున్నారు. ఈ దశలో మన తల్లి పలుకుకి తొలి ఘనతను సాధించడానికి మరిన్ని కుస్తీలు పట్టకతప్పదు.

అది అలా ఉంచి - ప్రాచీన హోదా కన్న, ప్రస్తుతం ఈ భాషను బ్రతికించే ప్రయత్నం ఎంత మాత్రం జరుతుతోంది? ఆలోచించవలసినదే. తెలుగు మాట్లాడే రాష్ట్రంలోనే ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి తెలుగుని పకలనివ్వకుండా, చదవనీయకుండా చేస్తున్న ’స్కూల్స్’ కుప్పలు తెప్పలు. పైగా తెలుగు అన్నా, రాసినా, చదివినా శిక్షించే విధానాలు కోకొల్లలు. తమ పిల్లలు తెలుగు మాట్లాడితే విలవిల్లాడిపోయే ’మమ్మీ, డాడీలు’ అసంఖ్యాకం. ఈ స్థితిలో ’ఒకనాటి భాష’ అని అనుకొనే రోజులు వస్తాయేమోనని భయం కలుగుతుంది.

ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు - కోవాలు కూడా. కానీ తెలుగును తగల బెట్టడమెందుకు? కుప్పతగలబెట్టి పేలాలు ఏరుకోవడం - అనే సామెత చందం.

అమెరికా పర్యటనలో తెలుగుతనాన్నీ, భారతీయతనీ పరిశీలిస్తూ సాగిన సందర్భంగా - మనవారి అభిమానం నన్ను అబ్బుర పరిచింది. సుదూరం వల్ల ఏర్పడినది - అనుకోవాలా? లేక విలువ తెలిసిన వివేకవంతులు - అని భావించాలా?

టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్‍లో ఒక చోట అనేక మంది పిల్లలు సుమతీ, వేమన, భాస్కర, కుమారీ శతకాలలోని పద్యాలను ధారాళంగా పుస్తకాపేక్ష లేకుండా చదివారు. వారు మామూలుగా చదివే అమెరికన్ చదువేకాక, తల్లిదండ్రుల ద్వారా వీటిని కూడా నేర్చుకుంటున్నారు. దీని బట్టి ఇంటి బాధ్యత ఏమిటో ఇక్కడి డాడీమమ్మీలు గ్రహింతురుగాక!

మరొకచోట (కాలిఫోర్నియా) సంప్రదాయపు వస్త్రధారణలో ఒక యువతి తేటతెలుగు మాట్లాడుతుంటే, "ఆంధ్రదేశంలో మీ ఊరు ఏదమ్మా?" అని అడిగాను. "నేను ఇక్కడే పుట్టి పెరిగాను. తెలుగు ఇంట్లోనే నేర్చుకున్నాను. చిన్నతనం నుండి మా ఇంట్లో అమ్మా నాన్న తెలుగు మాట్లాడడం వల్ల నాకు తెలుగు అబ్బింది" అని చెప్పిందా అమ్మాయి.

ఆమె తెలుగులో తడబాటు, అమెరికాయాస లేదు. సాధారణంగా అక్కడా ఇక్కడా కూడా ఒక భ్రాంతి వుంది. ఇంట్లో తెలుగు, స్కూల్లో ఇంగ్లీషయితే పిల్లలు అయోమయమవుతారనీ, అందుకే ఇంట్లో కూడా ఇంగ్లీషే మాట్లాడాలని - స్కూల్ అధికారులు ’పేరెంట్స్’కి శ్రీముఖాలు పంపుతుంటారు. కానీ అది తప్పుడు అభిప్రాయం.

"నా చిన్నప్పుడు మా తల్లిదండ్రులకి కూడా ఇలాంటి ’నోటీసులు’ వచ్చాయి. కానీ మా నాన్న’ఇంగ్లీష్ రాకపోయినా ఫరవాలేదు. మా అమ్మాయి ఇంట్లో తెలుగే మాట్లాడుతుంది’ అన్నారు. నేను ఇంగ్లీషు చదువుకున్నాను. ఆ భాషని అనర్గళంగా మాట్లాడగలను. తెలుగు కూడా శుభ్రంగా మాట్లాడతాను, వ్రాస్తాను’ అని చెప్పిందా తల్లి.

అందరూ కాకపోయినా, చాలామంది అమెరికాలో పుట్టిన తెలుగు యువత ఇటువంటి వారు అనేక చోట్ల కనబడ్డారు. దానికి తోడు ప్రతివారం ఆలయాల్లో తెలుగు, తమిళం వంటి భారతీయ భాషల్ని నేర్పుతున్నారు.

మన ఆలయాలు అమెరికాలో సంస్కృతి పరిరక్షణ కేంద్రాలు - అని నిర్వచించవచ్చు.

ముఖ్యంగా ’సిలికానాంధ్ర’ సంస్థవారు అమెరికాలో 15 రాష్ట్రాల్లో ’మనబడి’ పేరుతో తెలుగును నేర్పుతున్నారు. ఎందరో నేర్చుకుంటున్నారు. దీనిని నిర్వహిస్తున్న మన వారందరికీ చేతులు జోడించి నమస్కరించాలి.

ఇలాంటి ’మనబడులు’ ఇప్పుడు మన రాష్ట్రంలో నిలకొల్పాలి. విద్యావ్యాపార సంస్థలలో తెలుగు నలిగిపోతున్న ఈ సమయం లో, ప్రభుత్వాలు నిద్రపోతున్న తరుణంలో భాషని బ్రతికించే మార్గాలు యోచించాలి. ఏడాదికోసారి మాతృభాషాదినోత్సవాలు జరిపించి చేతులు దులుపుకుంటున్న క్షుద్రరాజకీయులతో నిండిపోయిన ప్రభుత్వం వల్ల భాష బ్రతకదు. వారికి చిత్తశుద్ధే ఉంటే తెలుగును ప్రధాన విషయంగా పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రవేశపెట్టేవారు. తెలుగు నేర్పేవారు కూడా "యిజాలు"గా తెలుగు
సాహిత్యాన్ని ముక్కలు చీసి విద్యార్ధుల తలల్ని విషమయం చేయకుండా జాగ్రత్తపడాలి.

అమెరికా లో రాష్త్రీయ,జాతీయ స్థాయిలలో ’స్పెల్లింగ్’ పోటీలు నిర్వహిస్తున్నారు. దీని బట్టి అంగ్లభాషా పటిష్ఠతకు వారు చేస్తున్న కృషి తెలుస్టోంది .మన రాష్త్ర ప్రభుత్వాలు , స్వచ్చంద సంస్థలు కూడా తెలుగు ఉచ్ఛారణ, పదాల శుద్ధతపై ఇటువంటి పోటీలు నిర్వహించే యోచన చేయాలి.

ప్రథమంగా ఇంట్లో తల్లిదండ్రులు వారి చిన్ననాటి పాఠ్యపుస్తకాలను గుర్తుతెచ్చుకొని పిల్లలకి నేర్పాలి. నేటి పాఠ్యపుస్తకాల్లో ’వాదాల’ జబ్బు ముదిరిన అధ్యాపకుల వల్ల తెలుగు శోభ తగ్గిపోతోంది.రకరకాల తర్కాలు చేసి తెలుగుపై విరక్తిని పుట్టిస్తున్న అచార్యుల నుండి కూడా తెలుగును కాపాడాలి.

చూస్తూ వుంటే - కొన్నాళ్ళకి ఆంధ్రం నేర్పడానికి అమెరికా నుండి ఆచార్యులు రావలసి వస్తుందేమో!

బర్కిలీ లాంటి విశ్వవిద్యాలయాల్లో తెలుగు నేర్చుకొంటున్న పాశ్చాత్యులు ఉన్నారని విని మురిసిపోయాను.అన్నమయ్య పాటలు స్తోత్రసాహిత్యం,నాట్యం... మొదలైన కళల్ని నేర్చుకోవడం వల్ల కూడా తెలుగు బతుకుతోంది. ఈ పద్ధతుల్లోనైనా పిల్లల్లో తెలుగు జీవింపచేయాలి.

నేటి విద్యావిధానం బారతీయ భాషల్ని, భారతీయతనీ ధ్వంసం చేసేందుకు సంకల్పించుకున్న విదేశీభావుకుల హస్తాల్లో ఉంది. భారతదేశంలో భారతీయతకు మనుగడ లేకుండా చేయాలనుకొంటున్న ఎడమవంక వారి కుటిలత్వం చదువుల తల్లిని బాధిస్తోంది.

ఇన్ని అవరోధాల నడుమ - ఒక మహానాగరక సంస్కార భాషని సజీవంగా ఉంచే ఉద్యమాన్ని చేపట్టాలి

- సామవేదం షణ్ముఖ శర్మ
-----------------------------------------------------------------------------------
ఋషిపీఠం ఆధ్యాత్మిక మాస పత్రికలో సామవేదం షణ్ముఖ శర్మగారి ఈ మాసం సంపాదకీయం బ్లాగరులతో పంచుకుందామని.