Thursday, August 31, 2006

సిప్రాలి - శ్రీశ్రీ - సిగరెట్టిస్తా, శతకం రాసిస్తావా?


"నీకొక సిగరెట్టిస్తా,
నాకొక శతకమ్ము రాసి నయముగ నిమ్మా,
త్రైకాల్య స్థాయిగ నీ
శ్రీ కావ్యము వరలునోయి సిరిసిరిభాయీ!

ఒక సంపాదకుడు శ్రీశ్రీ కలలో కనబడి పద్యాలు రాయమని అడిగాడని ఇక్కడ ఊహ। ఇంతకీ ఆ వ్యక్తి చక్రపాణి - అసలు పేరు ఆలూరి వెంకటసుబ్బారావుగారు (1903 - 1975) ఆంధ్రజ్యోతి (మాసపత్రిక) సంపాదకుడు। యువపత్రిక (పాతది, కొత్తది కూడా) ప్రచురణ సంస్థ వ్యవస్థాపకుడు। చలం, కొడవటిగంటి కుటుంబరావు మొదలైన వారి రచనలను ప్రచురించారు। బడదీది, పల్లీయులు, దేవదాసు వగయిరా శరత్ నవలలను అనువదించి ప్రచురించారు। 'చందమామ' వ్యవస్థాపకులు - విజయ పిక్చర్సు అధినేతలయిన నాగిరెడ్డి, చక్రపాణిల్లో ఒకరు। "మాయాబజార్" లాంటి మరపురాని తెలుగు సినిమాలని నిర్మించిన సంస్థ విజయ పిక్చర్సు।

సిప్రాలి - శ్రీశ్రీ - అవురా


అవురా, శ్రీరంగరం శ్రీ
నివాసరావూ, బలే మనిషివే, ఇక నీ
కవితా వాద్యం చాలిం
చి వెళ్లి పొమ్మనకు నన్ను సిరిసిరిమువ్వా!

శ్రీశ్రీ - సిప్రాలి - కప్పుడు కాఫీ


ఎప్పుడు పడితే అప్పుడు
కప్పెడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్
చొప్పడిన యూరనుండము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము మువ్వా!


సుమతీ శతకం లోని ఈ కింది పద్యానికి పారడీనా ఇది?

అప్పిచ్చువాడు, వైద్యుడు,
నెప్పుడు నెడతెగక బాఱు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము,
చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతీ!

Wednesday, August 30, 2006

శ్రీశ్రీ - సిప్రాలి - మళ్ళీ ఇన్నాళ్లకి


మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ
న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్
పళ్ళూడిన ముసిలిది కు
చ్చిళ్ళన్ సవరించినట్లు సిరిసిరిమువ్వా!

శ్రీశ్రీ తన చిన్నతనంలో పద్యాలు రాసేవారేమో !! ఒక సారి వచన కవితల వైపు వచ్చాకా ఇక పద్యాలు రాయలేదనుకుంటా.

Friday, August 25, 2006

సిప్రాలి - మొదటి దశ

"కందం చెప్పినవాడు కవి - పందిని పొడిచినవాడు బంటు" అన్న సామెత కి sattire ఈ పద్యం

"పందిని చంపిన వాడే
కందం రాయాల" టన్న కవి సూక్తికి నా
చందా ఇస్తానా? రా
సేందు కయో షరతులేల? సిరిసిరిమువ్వా!

Wednesday, August 23, 2006

శ్రీశ్రీ - సిప్రాలి

శ్రీశ్రీ వి "సిరిసిరిమువ్వా" అనే మకుటంతో ఉండే కంద పద్యాలు అక్కడక్కడ కొన్ని చూసాను। శ్రీశ్రీ ఛందస్సులో పద్యాలు రాసారని నాకు అంతకు ముందు తెలీదు। పద్యాలు అంటే నాకు ఇష్టం। కంద పద్యాలంటే మరీ ఇష్టం। ఇక శ్రీశ్రీ రచించినవి అంటే అదింకొక ప్రత్యేకత। వెరసి ఎప్పటినుంచో అవి ఉన్న పుస్తకం సంపాదించాలునుకున్నాను। మొత్తానికి ఈ మధ్యనే అది సాధ్యపడింది। శ్రీశ్రీ వి మరికొన్ని పద్యాలు చేర్చి "సిప్రాలి" అనే పుస్తంలో ప్రచురించారు। అది పాత ప్రచురణ। దాని ప్రతి ఒకటి నాకు లభ్యమయ్యింది। సిప్రాలి అనే పేరులోనె ప్రత్యేకత ఉంది। ఆ పేరు "సిరిసిరిమువ్వా", "ప్రాసక్రీడలు", "లిమఋక్కులు" లోని మొదటి అక్షరాలు। ఇవి ఈ పుస్తకంలోని మూడు భాగాలు !
ఈ పుస్తకంలో నన్ను ఆకర్షించిన కొన్ని పద్యాలు ఇక్కడ రాస్తున్నాను।

పుస్తకంలోని మొదటి పద్యం ఇది

అందంగా, మధురస ని
ష్యందంగా, పఠితృ హృదయ సంస్పందంగా
కందా లొకవంద రచిం
చిందికి మనసయ్యె నాకు సిరిసిరిమువ్వా!